Share News

ఓటు జాగ్రత్త..!

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:04 AM

ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈలక్ష్యంతో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌) ప్రక్రియ గత నెల 25న ప్రారంభమైంది. అయితే తమ అనుకూల ఓట్లను రద్దు చేసేందుకు సర్‌ను నిర్వహిస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి.

ఓటు జాగ్రత్త..!

జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈలక్ష్యంతో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌) ప్రక్రియ గత నెల 25న ప్రారంభమైంది. అయితే తమ అనుకూల ఓట్లను రద్దు చేసేందుకు సర్‌ను నిర్వహిస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న సర్‌ కార్యక్రమం అనేక ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంపై అవగాహన కలిగి ఉండడమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా 7,21,032 మంది ఓటర్లున్నారు. సర్‌ ప్రక్రియలో భాగంగా వీరిలో వలస వెళ్లిన, చనిపోయిన, డబుల్‌ ఎంట్రీ ఓట్లను తొలగించి, అర్హులైన ఓటర్లను చేర్చనున్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) ఇంటింటి సర్వే ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నాటికి 91.68 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి చేశారు. ఆ ఫామ్‌లు తీసుకున్న వారు వాటిని పూర్తి చేసి, తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వాలి.

ఇదీ సర్‌ ప్రక్రియ..

గత నెల 15వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేసి ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇస్తారు. ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు క్లయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ జరుపుతారు. ఈనెల 24వ తేదీ నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు నోటీసులకు జవాబులు, విచారణ, సెప్టెంబరు 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురణ చేస్తారు

ఓటర్లు ఏం చేయాలంటే..

బీఎల్‌వో ఇంటికి వచ్చి ప్రతి ఓటరుకు వారి ఫొటోతో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు ఇస్తారు. 2002 ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఆ వివరాలను ఆ పత్రంలో పేర్కొనాలి. పేరు లేకపోతే తల్లిదండ్రులు, భార్య, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి. పుట్టిన తేదీ, ఆధార్‌ నంబరు, మొబైల్‌ నంబరు, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి, భార్య, భర్త పేరు, వారి ఫొటో గుర్తింపుకార్డు (ఎపిక్‌) నంబరు నింపాలి. కొత్తగా దిగిన పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు రెండు ఇవ్వాలి. పూర్తి చేసిన పత్రాలను ఒకటి బీఎల్‌వో తీసుకొని, మరో దానిపై సంతకం చేసి ఓటరుకు రసీదుగా అందిస్తారు. ఒకవేళ ఆయా ఓటర్ల తరపున వేరే వ్యక్తులు ఈ ఫామ్‌లు అందజేస్తే వారి మద్య బంధుత్వం పేర్కొనాలి. ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసునని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌ కూడా ఇవ్వాలి.

కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగ గుర్తింపుకార్డు లేదా పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ వంటి సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజ్‌ఫొటో, విద్యార్హతకు సంబంధించి బోర్డులు, యూనివర్సీలు జారీ చేసిన సర్టిఫికెట్లు, ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌, ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డులు ధ్రువీకరణ పత్రాలుగా చెల్లుబాటు అవుతాయి. ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన వారు 2002 ఓటర్ల జాబితాలో పేరుండి తల్లిదండ్రుల డాక్యుమెంట్లు లేకపోతే భయపడాల్సిన పని లేదు. వారి తల్లిదండ్రుల లేదా బంధువుల ఓటరు కార్డు నంబరు లేదా ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డుల వివరాలు ఇస్తే సరిపోతుంది.

ఆన్‌లైన్‌లోనూ అవకాశం..

బీఎల్‌వోలు ఇంటింటికీ పర్యటించి ఓటర్లను ఎన్‌రోల్‌ చేస్తారు. అందుబాటులో లేని వారు నిర్ణీత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ప్రత్యేక యాప్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. సందేహాలుంటే ఓటర్ల హెల్ప్‌ లైన్‌ నంబరుకి కాల్‌ చేయవచ్చు.

అప్రమత్తత అవసరం..

ఎన్యూమరేషన్‌ ఫారం అందుకున్నప్పటి నుంచి ఓటర్ల జాబితాలో పేరుందో లేదో సెప్టెంబరు 22 వరకూ పరిశీలించుకోవడం తప్పనిసరి. ఓటర్లు 2002 జాబితాలో తమ పేరుందో లేదో చూసుకోవాలి. 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సిద్ధం చేసుకోవాలి. ఈనెల 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఆగస్టు20లోగా అభ్యంతరం తెలియజేయాలి. వాటిని పరిష్కరించి సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల చేస్తారు. బీఎల్‌వోలు ఇంటిని మూడు సార్లు సందర్శించినప్పటికీ ఓటరు అందుబాటులో లేకపోతే ఆ ఇంటికి నోటీసు అతికించి ఓటు తొలగింపుపై ఉన్నతాఽధికారులకు నివేదిస్తారు. అయితే ఆ ఓటరుకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎన్నికల కమిషన్‌ సూచించిన ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి చూపించి, వివరాలు చెప్పినా సరిపోతుంది. ఏ కారణం చేతనైనా ఓటును తొలగిస్తే ఫామ్‌-6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కు పోయినట్లే అవుతుంది. ఒకసారి తుది జాబితా వచ్చాక 2002 జాబితాలో పేరు లేని ఓటర్లు 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో కనీసం ఏదో ఒకటైనా లేకపోతే ఓటు హక్కు కోల్పోతారు. అందుకే బీఎల్‌వో ఇచ్చే ఫామ్‌లో తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని మరీ ఓటర్లు లేదా వారి ప్రతినిధులు సంతకం చేసి ఇవ్వాలి.

కలెక్టరేట్‌లో హెల్ప్‌ డెస్క్‌...

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌కు కలెక్టరేట్‌లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్యూమరేషన్‌ ఫారం నింపడంపై సందేహాల నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో 7989193131 నంబరుకు కాల్‌ చేయాలి. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్‌ డెస్క్‌ ద్వారా అధికారులు అందుబాటులో ఉంటున్నారు.

ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సక్రమంగా నింపి ఇవ్వాలి

- సత్యప్రసాద్‌, కలెక్టర్‌

సర్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సరి చూసుకొని ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సక్రమంగా నింపి సమర్పించాలి. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను సద్వినియోగం చేసుకొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. ఓటర్లుకు అందుబాటులో అధికారులు ఉంటారు.

జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ వివరాలు..

----------------------------------------------

నియోజకవర్గం...మొత్తం ఓటర్లు....ఫారాలు పంపిణీ ...శాతం

కోరుట్ల - 2,49,854 - 2,22,078 - 88.88

జగిత్యాల - 2,39,173 - 2,09,064 - 87.41

ధర్మపురి - 2,32,005 - 2,29,930 - 99.11

------------------------------------------------------

మొత్తం - 7,21,032 - 6,61,072 - 91.68

----------------------------------------------------------

Updated Date - Jul 05 , 2026 | 01:04 AM