అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:06 AM
భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద ప్రాంతాలను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు.
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద ప్రాంతాలను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. వీర్లపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వరద నీరు చేరకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్ తక్షణమే చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఓసీపీ-3 యంత్రాలతో నీటిని వేగంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వరద ప్రవాహాల నేపథ్యంలో అధికా రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరద ముంపునకు గురైన 38, 50వ డివిజన్లు హనుమాన్‌నగర్, మల్లికార్జున్‌నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతో కొన్ని ప్రాంతాల్లో నాలాలు సరిగా లేక వరద నీరు ఇండ్లలోకి చేరాయని, తక్షణమే వాటి పరిష్కారానికి యాజమాన్యం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను, నీటి నిల్వలతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీ, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ఉన్నారు.