Share News

బల్దియా తొలి సమావేశానికి సన్నద్ధం

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:50 AM

నగరపాలక సంస్థ పాలకవర్గం తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న పాలకవర్గం కొలువుతీరింది. నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా 46 మంది కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికై బల్దియాలో అడుగుపెట్టారు.

బల్దియా తొలి సమావేశానికి సన్నద్ధం

కరీంనగర్‌ టౌన, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పాలకవర్గం తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న పాలకవర్గం కొలువుతీరింది. నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా 46 మంది కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికై బల్దియాలో అడుగుపెట్టారు. సరిగ్గా 40 రోజులుదాటినా ఇప్పటి వరకు కనీసం కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమం కానీ, సమావేశం కానీ జరుగలేదు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగింపు ఉండడంతో బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌, మధ్యాహ్నం 2 గంటలకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు కార్పొరేటర్లకు 2025-26 సవరణ బడ్జెట్‌, 2026-27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌తో కూడిన ఎజెండా ప్రతులను పంపిణీ చేశారు.

312.46 కోట్లతో అంచనా బడ్జెట్‌ :

నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 301.46 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, 2026-27 ఆర్థిక సంవత్సరంలో 11 కోట్లను పెంచుతూ రూ.312.46 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్ల రూపేణా నిధులు వస్తాయని అంచనా వేశారు. ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల ద్వారా 190.34 కోట్లు సమకూరుతాయని భావించారు. గత సంవత్సరం కూడా అధికారులు ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో రూ.183.81 కోట్లు వస్తాయని అంచనా వేయగా కేవలం 95.52 కోట్లు మాత్రమే వచ్చాయి. గడిచిన ఏడాది అంచనాలో సగం మేరకే నిధులు రాగా ఈసారి గత ఏడాది కంటే 7 లక్షలు అధికంగా అంచనా వేశారు. బడ్జెట్‌లో ముఖ్యంగా ప్రణాళికేతర ఆదాయం (నాన ప్లాన గ్రాంట్లు) రూ.35.03 కోట్లు, ప్రణాళిక నిధులు రూ.102.82 కోట్లు, ఇతర నిధులు రూ.52.49 కోట్లు, వస్తాయని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక నిధులు రూ.111 కోట్లు వస్తాయని అంచనా వేయగా వాటిలో 58 కోట్లు వచ్చినట్లు సవరణ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ సారి అంచనా మేరకు ఆ స్థాయి మేరకు నిధులు వస్తాయని అంచనా వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రాంట్లు వస్తే తప్ప నగరంలో అభివృద్ధి జరిగే అవకా శాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.

పన్నుల ద్వారా రూ.113 కోట్ల ఆదాయం :

నగరపాలక సంస్థ అంచనా బడ్జెట్‌లో వివిధ పన్నుల రూపంలో సమకూరే జనరల్‌ ఫండ్‌ రూ.113 కోట్ల వస్తాయని పేర్కొన్నారు. వీటిలో ముఖ్యంగా ఆస్తి పన్నుల ద్వారా 57.95 కోట్లు, బదిలీ ఆదాయం రూ.11 మరో కోట్లు వస్తుందని ఆశిస్తుండగా, టౌనప్లానింగ్‌ ద్వారా రూ.25.28 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా రూ.9.09 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే టౌనప్లానింగ్‌లో అడ్వర్టయిజ్‌మెంట్‌ ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టిపెడితే మరింత ఆదాయం పెంచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పారిశుధ్య విభాగం నుంచి 4.07 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వాస్తవానికి ఇప్పటికే వాణిజ్య చెత్తసేకరణను ప్రైవేట్‌ పరం చేయడంతోపాటుగా చికెన వ్యర్థాలు, ట్రేడ్‌ లైసెన్సు ఆదాయాలను సరిగా పరిగణలోకి తీసుకొని అక్రమాలకు చెక్‌పెడితే ఈ విభాగంలో రెట్టింపు అంటే సుమారు 10 కోట్ల వరకు ఆర్జించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆదాయంలో సింహభాగం నిర్వహణ ఖర్చులకే...

నగరపాలక సంస్థకు జనరల్‌ ఫండ్‌ ద్వారా 113 కోట్లు అంచనా వేయగా ఆ ఆదాయంలో సింహభాగం 76.96 కోట్లు నిర్వహణ ఖర్చులకే పోతాయని చూపించారు. వాటిలో ముఖ్యంగా పారిశుధ్య విభాగం కార్మికుల వేతనాలు, నిర్వహణ వ్యయాలకే సుమారు రూ.50 కోట్ల మేరకు కేటాయింపులు చేశారు. దీనితోపాటు కరెంటు బిల్లులకు రూ.11.40 కోట్లు, నీటి నిర్వహణ ఖర్చులు రూ.6.94 కోట్లు, పరిపాలన వ్యయం రూ.8..23 కోట్లు, గ్రీన బడ్జెట్‌కు 11.37 కోట్లు కేటాయించారు. అలాగే నగరంలోని అభివృద్ధి పనులకు 15.91 కోట్ల కేటాయింపులు మాత్రమే చేశారు. బలహీనవర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు, విలీన గ్రామాల అభివృద్ధికి జనరల్‌ ఫండ్‌లో 33శాతం అంటే రూ.8.46 కోట్ల నిధులను కేటాయించారు. జనరల్‌ ఫండ్‌లో మిగులు నిధులు కేవలం 24 కోట్లు మాత్రమే.

సవరణ బడ్జెట్‌కు, అంచనా బడ్జెట్‌కు తీవ్ర వ్యత్యాసం

గత ఆర్థిక సంవతర్సంలో అధికారులు రూపొందించిన అంచనా బడ్జెట్‌లో ఆదాయం, వ్యయాల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్‌ను పరిశీలిస్తే దాదాపు అధికారుల అంచనా బడ్జెట్‌కు, సవరించిన బడ్జెట్‌కు చాలా వ్యత్యాసం ఉంది. అయినా కూడా గత ఏడాది అంచనాలను కొద్దిగా పెంచుతూ 2026-27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. దీనిపై పాలకవర్గం ఏ విధంగా స్పందిస్తుందో, అధికారులు ఎలా వారికి సమాధానవి ుస్తారో వేచిచూడాలి.

Updated Date - Mar 29 , 2026 | 12:50 AM