కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన పెరగాలి
ABN , Publish Date - May 01 , 2026 | 11:57 PM
కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన పెరగాలని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ దాసరి వేణు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
పెద్దపల్లి కల్చరల్, మే1(ఆంధ్రజ్యోతి): కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన పెరగాలని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ దాసరి వేణు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి శాఖలో పని చేసే ఉద్యోగులంతా శ్రామికులేనని, మనమందరం శ్రమజీవులమేనన్నారు. శ్రామిక హక్కులు, ప్రయోజనాలు పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని అన్నారు. జిల్లాలోని శ్రామిక సంఘాలకు కార్మిక శాఖ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కార్మికులకు కూడా ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చూడాలని ఆయన సూచించారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, జిల్లాలోని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం వంటి పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మేడే పురస్కారాలను పలువురు కార్మికులకు అందజేశారు. సహాయ కార్మిక కమిషనర్ వెంకటరమణ, జిల్లా సహాయ కార్మిక అధికారి రఫీ, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్‌తోపాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.