దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:54 PM
గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు.
కోల్‌సిటీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై చర్చించారు. దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేడియం పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని సంతోషంగా పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జల్ద అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి, ఏసీపీ రమేష్, సీఐ ఇంద్రసేనరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.