ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:26 PM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లును నియమించినట్లు తెలిపారు. అదనంగా ఒక ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్‌తోపాటు నాలుగు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు జనరల్ విభాగంలో 4116 మంది, ఒకేషనల్‌లో 1004 మంది మొత్తం 5120 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 4229 మంది, ఒకేషనల్ విభాగంలో 1018 మంది మొత్తం 5247 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు పరీక్షలు రాసుకునేలా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. పరీక్షలు రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని వివరించారు.
పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలి
విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందు చేరుకోవాలని నోడల్ అధికారి కల్పన సూచించారు. ఈసారి నిమిషం ఆలస్యాన్ని సడలిస్తూ నిర్ణీత సమయం 9 గంటల 5 నిమిషాల వరకు వచ్చిన వారిని అను మతిస్తామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి పరీక్షా ప్రారంభానికి 45 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను లోనికి అనుమతిస్తా మన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవా లని అన్నారు. అలాగే హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచామని, వాటిని నేరుగా డౌన్‌లోడ్ చేసుకొని వెళ్లవచ్చని అన్నారు. ప్రిన్సిపాల్ ధ్రువీకరణ లేని వారు కూడా ఐడి కార్డు హాల్ టికెట్‌తో నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లవచ్చని ఆమె పేర్కొన్నారు.