Share News

ఓటుపై ఆందోళన

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:47 PM

రామగుండం నియోజకవర్గ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే స్థాయిలో తగ్గిపోవడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. 2023లో 2,13,000ఓట్లు ఉంటే ప్రస్తుతం 1,83,233 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

ఓటుపై ఆందోళన

కోల్‌సిటీ, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే స్థాయిలో తగ్గిపోవడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. 2023లో 2,13,000ఓట్లు ఉంటే ప్రస్తుతం 1,83,233 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 30757ఓట్లను తొలగించారు. ఇందులో చనిపోయిన వారు 4,748మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు 8810, రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు 16,903, ఇతర గైర్హాజర్‌ వారు 296మంది ఉన్నారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో రామగుండం అర్బన్‌, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉన్నాయి. ఇందులో రామగుండం అర్బన్‌లోనే 26643ఓట్లు తగ్గాయి. పాలకుర్తిలో 2149, అంతర్గాంలో 1965ఓట్ల తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం డ్రాప్టు పబ్లికేషన్‌లో 1,83,233ఓట్లు మాత్రమే ఉన్నాయి.

సర్‌ ప్రక్రియలో 55వేల మందికి నోటీసులు

రామగుండం నియోజకవర్గ పరిధిలో సర్‌ ప్రక్రియలో 55వేల మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో పేర్లు, పుట్టిన తేదీలు ఇతర తప్పులు, తల్లిదండ్రుల వివరాలు సరిగా లేని వారు, అనామలైజ్‌ కింద 49034మందికి నోటీసులు జారీ అయ్యాయి. అలాగే 5,555మందికి మ్యాపింగ్‌ కాలేదు. ఇందులో రామగుండం అర్బన్‌లో రికార్డు స్థాయలో 44,086మందికి నోటీసులు జారీ అయ్యాయి. అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో అనామలైజ్‌ కింద అంతర్గాంలో 4476, పాలకుర్తిలో 4474 మందికి నోటీసులు ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం డివిజన్‌ లెవల్‌లో సభలు నిర్వహిస్తున్నారు. అన్నీ డివిజన్లలో హెల్ప్‌డెస్క్‌లు పెట్టారు. ఓటు తొలగిపోకుండా అవసరమైన అవగాహన కల్పించాలని బీఎల్‌వోలను ఇంటింటికి పంపుతున్నారు.

అప్రమత్తమైన అధికార పార్టీ

రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే 30,757ఓట్లు తగ్గడం, మరో 55వేల మందికి ఎస్‌ఐఆర్‌ నోటీసులు జారీ కావడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బూత్‌ల వారీగా ఓట్లను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రతీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. బీఎల్‌వోలను సమన్వయం చేసుకుకోవాలని కార్పొరేటర్లు, డివిజన్‌ లెవల్‌ నాయకులకు సూచనలు చేస్తున్నారు. రామగుండంలో ఓట్లు గణనీయంగా తగ్గినా విపక్ష పార్టీలు సర్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఒకటి రెండు సార్లు నాయకులతో సమావేశాలు నిర్వహించినా క్షేత్రస్థాయిలో మాత్రం ముందుకు పోవడం లేదు. 55వేల మందికి నోటీసులు జారీ చేసిన పరిస్థితుల్లో మళ్లీ ఎన్ని ఓట్లు పోతాయోననే ఆందోళన రాజకీయ పక్షాల్లో వ్యక్తమవుతుంది.

’సర్‌’లో కీలకంగా గ్రామ సభలు

మంథని, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఎలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రోగ్రాం తుది దశకు చేరుకుంది. ఇటీవల నిర్వహించిన సర్వే అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. పలు అంశాల పై ఓటర్లకు అవకాశం కల్పించడానికి గురువారం ఊరురా.. బీఎల్‌వోలు గ్రామ, వార్డులను సభలను నిర్వహించారు. గ్రామ, వార్డుల్లోని ఓటర్ల ముసాయిదా జాబితాలను బీఎల్‌వోలు చదివి వినిపించారు. తొలగించిన ఏఎస్‌డీడీ (ఆచూకీ దొరకని, వలస వెళ్లిన, మృతి చెందిన, డూప్లికేట్‌) ఓటర్ల వివరాలను వెల్లడించారు. అనామలిస్‌, అన్‌-మ్యాపింగ్‌ కింద ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు అందించిన వివరాలను తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ ఓటరు పేరును తుది జాబితాలో ఉండేలా చూసేందుకు చర్యలు చేపట్టారు. బోగస్‌ ఓట్లు తదితర అభ్యంతరాలు వస్తే వాటిని నమోదు చేసుకున్నారు. ఈఏడాది అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఉంటే వారి వివరాలను సేకరించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8లను అందుబాటులో ఉంచారు. పేర్లు, చిరునామాలో తేడాలు, అక్షర దోషాలు ఉంటే మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. మంథని మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో, మున్సిపల్‌ పరిధిలోని 13 వార్డుల్లో బీఎల్‌వోలు గ్రామ సభలను ప్రజల, రాజకీయ పార్టీల నేతలు, అధికారుల సమక్షంలో నిర్వహించారు.

Updated Date - Aug 27 , 2026 | 11:47 PM