Share News

మారుపేర్లు, విజిలెన్స్‌ కేసులు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:47 PM

సింగరేణి సంస్థలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం ఆర్‌జీ-1 ఏరియా జీఎం కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌, టీజీబీకేఎస్‌ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ముట్టడించారు.

మారుపేర్లు, విజిలెన్స్‌ కేసులు పరిష్కరించాలి

గోదావరిఖని, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం ఆర్‌జీ-1 ఏరియా జీఎం కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌, టీజీబీకేఎస్‌ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పిల్లలు మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల సమస్యల పరిష్కారానికి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి ఉద్యోగం కొడుకుకు అందే విధంగా కారుణ్య నియామకాల విధానాన్ని అమలు చేశారని, మెడికల్‌ బోర్డు ద్వారా అన్‌ఫిట్‌ అయిన అనేక మంది కార్మిక కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూపాలపల్లి సభలో మారుపేర్ల సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవ త్సరాలు గడుస్తున్నా పరిష్కారం చూపలేదని విమర్శించారు. సింగరేణి కార్మిక కుటుంబాల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలం భిస్తోందని, మారుపేర్లు, విజిలెన్స్‌ పెండింగ్‌ కేసులను పరిష్కరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం టీజీబీకేఎస్‌ నాయకులు, వడ్డేపల్లి శంకర్‌, మారుపేర్ల బాధితుడు లక్క శ్రావణ్‌ గౌడ్‌, ఇతర బాధిత కుటుంబాల సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యలను ఆర్‌జీ-1 జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jun 11 , 2026 | 11:47 PM