Share News

జోరుగా మద్యం అమ్మకాలు

ABN , Publish Date - May 10 , 2026 | 12:45 AM

జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక మద్యం షాపులతో పాటు అంతకు 10 రెట్లలో గ్రామాలలో అనధికార బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా రెట్టింపుగా సమకూరుతున్నది.

 జోరుగా మద్యం అమ్మకాలు

కరీంనగర్‌ క్రైం, మే 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక మద్యం షాపులతో పాటు అంతకు 10 రెట్లలో గ్రామాలలో అనధికార బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా రెట్టింపుగా సమకూరుతున్నది. రియల్‌ఎస్టేట్‌ రంగం అతలాకుతలమై ఆటుపోట్లను ఎదుర్కొంటుంటే మద్యం అమ్మకాలలో మాత్రం దూసుకుపోతున్నది. జిల్లాలో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలతో మందుబాబులు వెచ్చిస్తున్న డబ్బు సర్కార్‌కు ప్రధాన ఆదాయవనరుగా మారింది. వైనషాపుల లైసెన్సల కోసం పోటీపడి కోట్ల రూపాయలు దరఖాస్తు రూపంలోనే సమర్పించుకుంటున్నారు. 2025-27 ఎక్సైజ్‌ సంవత్సర కాలానికి 2,730 దరఖాస్తులు రాగా, దరఖాస్తుఫీజు 3 లక్షలుగా ప్రభుత్వానికి 81 కోట్ల 90 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్‌లోని మద్యం(ఐఎంఎల్‌) డిపోలో జిల్లాలోని వైనషాపు, బార్‌ షాపుల లైసెన్సదారులు కొనుగోలు చేసిన బిల్లు ప్రకారం జరిగిన వ్యాపారం మాత్రమే 1,238 కోట్ల 57 లక్షలు కాగా, దీనికి రిటైల్‌ షాపు లైసెన్సీలు 20 శాతం మార్జిన కలుపుకుని మద్యం అమ్మకాలు సాగిస్తుంటారు. 20 శాతం వ్యాపారుల మార్జిన 247 కోట్ల 14 లక్షలు కాగా ఏడాదిలో మొత్తం 1,485 కోట్ల 71 లక్షల మద్యం అమ్మకాలు సాగాయి. జిల్లా వ్యాప్తంగా మద్యం ప్రియులు నెలకు 123 కోట్ల 80 లక్షల మద్యం తాగేశారు. అనగా రోజుకు 4 కోట్లపైగా మద్యం అమ్ముడుపోయింది.

కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కరీంనగర్‌, కరీంనగర్‌ రూరల్‌, తిమ్మాపూర్‌, హుజురాబాద్‌, జమ్మికుంట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 2025 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2026 మార్చి 31వ తేదీ వరకు ఎక్సైజ్‌ ఆర్థిక సంవత్సరంలో 1,485 కోట్ల 71 లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరుగగా ఆ మేరకు ప్రభుత్వానికి, వ్యాపారులకు ఆదాయంగా సమకూరింది. 2025-26 సంవత్సరంలో 1,238 కోట్ల 57 లక్షలు రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాగా, 247 కోట్ల14 లక్షల రూపాయల్లు మద్యం వ్యాపారులకు కమీషన్‌ సమకూరింది. కరీంనగర్‌ జిల్లాలో (మద్యం డిపో) అమ్మకాలను గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 103 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకో వడానికి తరచుగా మద్యం ధరలను, మద్యం షాపుల లైసెన్స్‌ ఫీజుతో పాటు వివిధ పన్నులను పెంచుతూ పోతున్నది. మద్యం అమ్మకాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి.

పేద కుటుంబాలపైనే ప్రభావం

మద్యంతో పేదలు, కూలీలు, కార్మిక కుటుంబాల జీవనం విచ్ఛిన్నం అవుతున్నదని, కొన్ని కుటుంబాలు వీధినపడుతున్నాయని, ప్రభుత్వం మద్యంను నిషేధించాలని ఆయా వర్గాలకు చెందిన కొందరు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం విక్రయించరాదని, పల్లెల్లో బెల్ట్‌షాపులను మూసివేయించడం, కొన్ని గ్రామపంచాయతీలో మద్యం అమ్మకాలను నిషేదిస్తూ తీర్మాణాలు కూడా చేశారు. అయితే మరికొన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణకు గ్రామ అభివృద్ధికమిటీల ఆధ్వర్యంలో లక్షల్లో వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. మద్యంతో పేద కుటుంబాల ఆర్థిక స్థితి దిగజారిపోయి, అప్పుల పాలవటం, ఆత్మహత్యల వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించు కోకుండా ఆదాయమే పరమావధిగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 10 , 2026 | 12:45 AM