Share News

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:52 PM

రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ బండి రాజశేఖర్‌ ఆరోపించారు.

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

పెద్దపల్లి కల్చరల్‌, జూలై12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ బండి రాజశేఖర్‌ ఆరోపించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేసేం దుకు కుట్ర పన్నుతున్నదన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 14న బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు, కళాశాలలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, వారికి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ కూడా నిధులు విడుదల చేయకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి పేద విద్యార్థులను చదువుకు దూరం చేయవద్దని కోరారు. జిల్లా సోషల్‌ మీడియా కన్వీనర్‌ అరవింద్‌, నగర ఉపాధ్యాక్షుడు విగ్నేష్‌, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:52 PM