కులం సంఘాలకు గాలం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:55 AM
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైన వెలువడే అవకాశాలు ఉండడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఓటర్లకు గాలం వేసేందుకు కార్యాచరణ షురూ చేసిన ఆయా పార్టీలు.. కుల సంఘాల వారీగా మచ్చిక చేసుకునేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి.
జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైన వెలువడే అవకాశాలు ఉండడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఓటర్లకు గాలం వేసేందుకు కార్యాచరణ షురూ చేసిన ఆయా పార్టీలు.. కుల సంఘాల వారీగా మచ్చిక చేసుకునేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న ప్రధాన కులాలను వివిధ రాజకీయ పార్టీలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఆయా సంఘాలను తమ వైపు తిప్పుకుంటే గంపగుత్తగా ఓట్లు రాబట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఆయా కుల సంఘాలతో పార్టీల నాయకులు వరుసగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేందుకు కొన్ని రోజుల ముందు నుంచే అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో వివిధ కుల సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వడంతో పాటు శంకుస్థాపనలు చేసే ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో పలు కుల సంఘాలు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టిక్కెట్‌ను డిమాండ్ చేస్తుండడంతో పార్టీలు, కుల సంఘాల మధ్య పలు మున్సిపాలిటీల్లో దోబూచులాట చోటుచేసుకుంటోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లో..
ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల్లో కుల సంఘాల డిమాండ్ల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫీవర్ ఎక్కువవుతోంది. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో ప్రధాన రాజకీయ పక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కసరత్తు చేస్తున్నాయి. ఏ పార్టీ తమకు అనుకూలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందనే విషషయమై కుల సంఘాలు ఎదురు చూస్తున్నారు. పార్టీలు కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టిక్కెట్ల కేటాయింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఓ వర్గానికి చెందిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ కేటాయిస్తేనే తాము మద్దతు పలుకుతామని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. రోజురోజుకూ మారుతున్న పరిణామాల నేపథ్యంలో సమీకరణలు ఎలా ఉంటాయనే విషయమై రాజకీయ వర్గాల్లో, ఆయా పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి.
కుల సంఘాలతో ఒప్పందాలు..
అర్థబలం, అంగబలం కలిగిన కుల పెద్దలకు పలు తాయిలాలు అందిస్తామని హామీనిస్తూ తమ పార్టీలో చేరాల్సిందిగా పలు పార్టీలు గాలం వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తమకు సహకరించినట్లయితే కుల సంఘ భవనానికి నిధులు సమకూర్చడం, అభివృద్ధికి కొంత నిధులు ఇస్తామని ఒప్పందం చేసుకొని ఓట్లను రాబట్టుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కుల సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం కుల సంఘాలపై దృష్టి సారించాయి. కులాల వారీగా ఆయా సంఘాల నేతలను కలవడానికి ఎత్తులు వేస్తున్నారు. ఆయా వర్గాల వారీగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లోని పద్మశాలి, వైశ్య, కాపు, విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, గంగపుత్రులు, గౌడ తదితర కులాలతో పాటు పలు మున్సిపాలిటీల్లో ముస్లిం మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం కులసంఘాలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన బడా నాయకులు కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వర్గాలకు చెందిన ఓటర్లను తమకు మద్దతు పలికే విధంగా సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్లను రాబట్టుకోవడానికి సైతం నాయకులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కుల సంఘాలకు నజరానాలు అందించడానికి సైతం రాజకీయపక్షాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కుల సంఘాల ఓట్లను రాబట్టుకోవడానికి రాజకీయపక్షాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు సఫలీకృతమవుతాయో మరి వేచిచూడాల్సిందే.