సత్ఫలితాలనిస్తున్న అల్పాహారం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:16 AM
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యార్హులకు అల్పాహారం పథకం సత్ఫలితాలనిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న 17,244 విద్యార్థులకు రోజూ పలు రకాల టిఫిన్స్ ద్వారా పోషకాహారాన్ని అందించడానికి మంథనిలో నెల రోజుల క్రితం కమ్యూనిటీ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు
మంథని, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యార్హులకు అల్పాహారం పథకం సత్ఫలితాలనిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న 17,244 విద్యార్థులకు రోజూ పలు రకాల టిఫిన్స్ ద్వారా పోషకాహారాన్ని అందించడానికి మంథనిలో నెల రోజుల క్రితం కమ్యూనిటీ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు. సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వం-హరే కృష్ణ ఫౌండేషన్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిచెన్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగస్టు 24న ప్రారంభించారు. ఈ కిచెన్ ద్వారా విద్యార్థులకు నిత్యం అందించే పోషకాహార టిఫిన్లు అందిస్తున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 15 శాతం విద్యార్థుల హాజరు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 8 మండలాల్లో 325 ప్రభుత్వ పాఠశాలలు, 9 జూనియర్ కళాశాలలు కలిపి మొత్తం 334 విద్యా సంస్థలకు కిచెన్ ద్వారా రోజూ రుచికరమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం సరఫరా చేస్తున్నారు.
నెల రోజులుగా సేవలు
కిచెన్ ప్రారంభమైన నాటి నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోజూ అల్పాహారాన్ని తయారు చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా విద్యాసంస్థలకు సకాలంలో చేరవేస్తున్నారు. పరిశుభ్రమైన వాతా వరణంలో నాణ్యత ప్రమాణాలతో ఆహారాన్ని సిద్ధం చేసి, విద్యార్థులు పాఠశాలలకు చేరుకునే సమయానికి ముందుగానే చేరవేస్తున్నారు. పెద్దఎత్తున అల్పాహారం తయారీ, ప్యాకింగ్, పంపిణీ ప్రక్రియలను సమన్వయంతో కిచెన్ సిబ్బంది కృషి చేస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి తోడ్పాటు..
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లోని విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార స్థితి, విద్యా ప్రగతికి మద్దతుగా కొనసాగుతున్న ఈ స్కూల్ బ్రేక్‌ఫాస్టు కార్యక్రమానికి హరే కృష్ణ మూమెంట్ చారి టబుల్ ఫౌండేషన్ ఇండియా (హెచ్‌కేఎంసీఎఫ్) భాగస్వామిగా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు ఉదయమే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, పోషక స్థితి మెరుగుపడటంతోపాటు, పాఠశాలలో చదువుపై ఏకాగ్రత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది. 334 విద్యాసంస్థలకు నిరంతరంగా సేవలందించడమే కాకుండా, విద్యార్థుల హాజరులో 15 శాతం పెరుగుదలను నమోదు చేయడం ఆదర్శంగా నిలుస్తుంది.
విద్యార్థుల హాజరులో గణనీయమైన పెరుగుదల
స్కూల్ బ్రేక్‌ఫాస్టు కార్యక్రమం అమలు తర్వాత విద్యార్థుల హాజరులో సానుకూల మార్పు కనిపిస్తోంది. ఉదయాన్నే అల్పాహారం అందుబాటులో ఉండటంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరవుతుండగా, సగటు హాజరు దాదాపు 15 శాతం మేర పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో ఉత్సాహం, తరగతులపై ఆసక్తి, ఏకాగ్రత కూడా పెరిగినట్లు ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు.
విద్యార్థులకు పోషకాహారం ఎంతో ముఖ్యం
కోల్‌సిటీటౌన్, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు చదువుపై ఏకాగ్రత పెరిగి విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని జెడ్‌పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి అల్పాహారం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యకరమైన ఎదుగుదల పాఠశాలల్లో హాజరుశాతం పెంపు, విద్యపై ఆసక్తిని ప్రోత్సహించడం లక్ష్యాలతో పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ అరుణ, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.