జనమే బలమై సాగిన ఉద్యమం..
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:48 AM
ఉద్యమాలు, ఎన్నో పోరాటాలకు పురుడు పోసిన సిరిసిల్ల గడ్డ.. జనమే బలమై జిల్లా సాధన ఆకాంక్షను సాకారం చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు దశాబ్ద కాలం పూర్తయింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఉద్యమాలు, ఎన్నో పోరాటాలకు పురుడు పోసిన సిరిసిల్ల గడ్డ.. జనమే బలమై జిల్లా సాధన ఆకాంక్షను సాకారం చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు దశాబ్ద కాలం పూర్తయింది. నిజాం, రజాకార్ల అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరుతో ఎదుర్కొన్న యోధుల స్ఫూర్తి, దొరతనాలపై బందూకులను ఎక్కుపెట్టి ఉద్యమ ఉగ్గుపాలు తాగించిన సిరిసిల్ల నేలపై జిల్లా సాధన కోసం 45 రోజులపాటు సాగిన మహోద్యమ ఫలితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించింది. ప్రజలకు మరింత పాలనను చేరువయ్యే దిశగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించింది. మొదట్లో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తెరపైకి వచ్చి ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అంబేద్కర్ సంఘం, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలతో పాటు వృత్తి సంఘాలు, యూనియన్‌లు జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ, అప్పుడు ఉన్న అధికార పక్షంలోని బీఆర్‌ఎస్ నేతలు కొందరు జేఏసీ వైపు, మరికొందరు అప్పుడు మంత్రిని విశ్వసించి ఆయన వెంట ఉంటూనే సిరిసిల్ల జిల్లా అకాంక్షను చాటుతూ రోడ్డెక్కాయి. విభిన్న రూపాలలో పోరాటాలు చేపట్టాయి. ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి సిరిసిల్ల జిల్లా సాధన పోరాటానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం సిరిసిల్లకు వచ్చి జిల్లా సాధన పోరాటానికి సంఘీభావం తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ, విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లతోపాటు కళాకారులు గజ్జె కట్టి ప్రజలను చైతన్యపరిచారు. సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు చేయాలని ధర్నాలు, బంద్‌లు, అసెంబ్లీ ముట్టడి, రాస్తారోకోలు, దీక్షలు, ఆమరణ దీక్షలు, అణచివేతలు, అడ్డంకులు, ఒడిదుడుకులు కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొంటూ సిరిసిల్ల జిల్లా ఆకాంక్షను నేరవేర్చుకోవడానికి ఉద్యమంలా ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమం సాగుతున్న క్రమంలో ఇక జిల్లా కాదని నిరాశ చెందుతున్న క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలతో ఉత్తేజపరిచింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో తన తండ్రి ముఖ్యమంత్రిని మెప్పించే క్రమాన్ని గుర్తించి ‘ఏమో గుర్రం ఏగురావచ్చు.. సిరిసిల్ల జిల్లా కానూవచ్చు’ అని ముందే చెప్పింది. చివరి క్షణంలో జిల్లా ఏర్పాటు అవుతుందని ఇచ్చిన కథనం అక్షర సత్యం అయింది. అదేక్రమంలో జిల్లా సాధనలో వివిధ పార్టీల అగ్రనేతలు కలిసి మద్దతును కూడగట్టాయి. కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ లక్ష్మణ్‌కుమార్, గద్వాల జిల్లా ఉద్యమంలో కీలకంగా వ్యవహారించిన డీకే ఆరుణ సిరిసిల్ల జిల్లాను ఇవ్వాలని మద్దతు తెలిపారు. సిరిసిల్ల ప్రజల అకాంక్ష బలంగా ఉన్న క్రమంలో జిల్లాల ఏర్పాటు ఇక లేదనే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అప్పటి మంత్రి కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్, వేములవాడ అప్పటి ఏమ్మెల్యే రమేష్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, సిరిసిల్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, జేఏసీ నాయకులు బలంగా తమ వాణిని వినిపించడంతో చివరకు ప్రజల ఆకాంక్ష అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్, అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మార్క్‌తో స్వతహాగా ఉద్యమాల గడ్డగా ఉన్న సిరిసిల్ల పరిపాలనకు చేరువగా 2016 అక్టోబరు 11న జిల్లా కేంద్రంగా మారింది. తొమ్మిది మండలాలతో ఉన్న సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ 13 మండలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఏర్పాటు ప్రకటనకు ముందు పరిస్థితులు, పోరాట గురుతులు, నాటి జ్ఞాపకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
పదేళ్లలో ఎంతో మార్పు..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన చేరువైంది. అభివృద్ధిలో వేగం పెరిగింది. గతంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులను కలవడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది. జిల్లా ఏర్పడిన తర్వాత అధికారం కలవడం సులభంగా మారింది. అంతేకాకుండా తొమ్మిది మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న సిరిసిల్ల జిల్లాగా మారిన తర్వాత తంగళ్ళపల్లి, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ రూరల్ మండలాలతో పాటు వేములవాడ రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పడింది. బైపాస్ రోడ్‌లో రూ.75 కోట్లతో కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం భవనాలు నిర్మించారు. పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, డివిజన్ కార్యాలయాలు వచ్చాయి. జిల్లా విద్యారంగంలోనూ ముందడుగు వేసింది. జేఎన్‌టీయూ కాలేజీ, మెడికల్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం అయ్యింది. జిల్లా అసుపత్రిలో అధునిక సౌకర్యాలకు తోడు వేములవాడలో ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. టీహబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, రైతుబజార్‌లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఉండాల్సిన హంగులు సమకూర్చుకుంది. సిరిసిల్ల అర్బన్ మండలంలోని గ్రామాలను బల్దియాలో విలీనం చేసి బహుముఖంగా నగరంగా విస్తరిస్తోంది. రూపురేఖలు మారిపోతుండగా జిల్లా కేంద్రంలో విశాలమైన ఫోర్‌లేన్ రోడ్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్‌లు, కూడళ్లకు కొత్త శోభ, వీటికి తోడు జిల్లా కేంద్రానికి వచ్చిన బ్రాండెడ్ షోరూం కొత్త అందాన్ని తెస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోనే ప్రధాన రహదారుల అభివృద్ధి, కూడళ్లు, అంతర్గత రహదారులు, మురికి కాలువలు, వైకుంఠధామాలు, నూతన విద్యుత్ ఎల్‌ఈడీ బల్బులు, ఆదర్శమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా జంక్షన్ల అభివృద్ధి, చిల్డ్రన్ పార్కులను నిర్మించారు. కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మారింది. మినీ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చింది. స్విమ్మింగ్‌పూల్ నిర్మాణం, ఓపెన్‌జిమ్‌లు చేపట్టారు. పీఆర్ అతిథి గృహం, ఆధునిక హంగులతో సినారె జిల్లా గ్రంథాలయం నిర్మించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు, తాగు నీటి కోసం ఎదురుచూపులకు ఊరటనిచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గుండెకాయగా మారిన శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్ వచ్చింది. మిడ్ మానేరుకు అనుసంధానంగా మల్కపేట రిజర్వాయర్ పూర్తిచేశారు. కార్మిక, ధార్మిక జిల్లాగా ఆవిర్భవించిన సిరిసిల్ల ప్రగతిలో మరింత వేగాన్ని పుంజుకుంది. వ్యవసాయానికి సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లు శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి రాగా, మల్కపేట రిజర్వాయర్‌కు కాలువ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అపెరల్ పార్కులో పరిశ్రమలు వచ్చాయి. వర్కర్ టు ఓనర్ పథకానికి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో నేతన్నలకు ఉపాధి భరోసా కలిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అభివృద్ధి వైపు అడుగులు
కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలోనూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టితో ప్రధానంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని విస్తరించడమే కాకుండా వేములవాడ దేవస్థానం అభివృద్ధి, ఇతర పనులకు ప్రభుత్వం రూ.390 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల రూ.12 కోట్లతో చేపట్టిన గుడి చెరువు బండ్ పార్కును ప్రారంభించుకోవడంతో పాటు 40 ఆది శివుని విగ్రహం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతోంది. నాంపల్లి కుట్టపై ఇండియన్ ఎయిర్‌పోర్స్ సహకారంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నేత కార్మికులకు చేతినిండా పని కల్పించే దిశగా ఇందిరమ్మ స్వశక్తి చీరల ఆర్డర్లను అందించారు. మొదటి విడతగా పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేశారు. రెండో చీరగా చిలకపచ్చ చీరలను సిద్ధం చేశారు. సిరిసిల్ల పారిశ్రామికులు ఎన్నో రోజులకు ఎదురుచూస్తున్న రూ 50 కోట్లతో యారన్ డిపోను ఏర్పాటు చేశారు. నీటిపారుదుల పనుల్లో పురోగతిని తీసుకువచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 7088 ఇళ్లను మంజూరు చేశారు. దీంతో పాటు రూ.200 కోట్ల చొప్పున సిరిసిల్ల, చందుర్తి మండలం మూడపల్లి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మూడపలిల్లో నిర్మాణం ప్రారంభించారు. సిరిసిల్ల, కొనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లను మంజూరు చేశారు. టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు, తదితర అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చే దిశగా రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి రూ 45.15 కోట్లతో భూమిపూజ చేశారు. ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం మండపల్లిలో తాత్కాలికంగా ఏటీసీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో జిల్లా అభివృద్ధికి దృష్టి పెట్టారు.