నోటికి తాళం.. ఓటుకు బేరం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:40 AM
నోటికి తాళం వేశారు.. ఓటుకు నోట్ల బేరం మొదలైంది. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం 48 గంటల ముందు సోమవారం సాయం త్రం 5 గంటలకు ముగిసిపోయింది. గప్‌చుప్‌గా ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓట్లకు నోట్లు, నజరానాలతో ప్రలోభాలకు తెరలేపారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
నోటికి తాళం వేశారు.. ఓటుకు నోట్ల బేరం మొదలైంది. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం 48 గంటల ముందు సోమవారం సాయం త్రం 5 గంటలకు ముగిసిపోయింది. గప్‌చుప్‌గా ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓట్లకు నోట్లు, నజరానాలతో ప్రలోభాలకు తెరలేపారు. మంగ ళవారం రాత్రి కీలకంగా భావిస్తూ అభ్యర్థులు అందుకు సిద్ధమయ్యారు. తెల్లవారితే బుధవారం పోలింగ్ ఉండ డంతో అభ్యర్థులు ఖర్చులకు వెనకాడడం లేదు. ఇప్పటికే రెండు మున్సిపాలిటీలో రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చుకు సిద్ధమై ఎన్నికల బరిలో నిలిచారు. గడిచిన ఐదు రోజుల్లో అభ్యర్థులు రూ.20 లక్షల పైన ఖర్చు చేశారు. చివరి రెండు రోజులు మరో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ిసిరిసిల్లలో 170 మంది, వేములవాడలో 113 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. చివరి ప్రయత్నంగా మద్యం, డబ్బులతో పాటు గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఓటర్లు మాత్రం ఏ అభ్యర్థిని చిన్న బుచ్చకుండా అందరి నజరానాలు స్వీకరిస్తున్నారు. మీకే ఓటు అంటూ దీవించి పంపిస్తున్నారు చివరికి ఎవరికి ఓట్లు వేస్తారనేది సందిగ్ధంగా మారింది.
చివరి రోజు హోరెత్తిన ప్రచారం
మున్సిపల్ ఎన్నికల్లో సోమవారం చివరి రోజు కావడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో అభ్యర్థులు ప్రచారం హోరెత్తించారు. గెలుపు ధీమాతో డప్పుచప్పులతో వార్డులో భారీ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. హోరెత్తిన ప్రచారం సాయంత్రంతో ముగిసిపోవడం సిరిసిల్ల వేములవాడ పట్టణాలు నిశ్శబ్దంగా మారాయి. ఐదు రోజుల మున్సిపల్ ఎన్నికల్లో రెండు పట్టణాల్లో అగ్రనేతలు ప్రచారాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల కోసం ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు, కాం గ్రెస్ అభ్యర్థులను ఉత్సాహపరుస్తూ చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభా కర్, బీజేపీ అభ్యర్థుల కోసం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం చేశారు. భారీ జన సమీకరణతో జరిగిన కార్నర్ సమావేశాలు ఎవరికి లాభం కలుగుతుందని సందిగ్ధం కూడా నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారాలు కొనసా గించారు. అభ్యర్థులు వాయిస్ కాల్స్‌తో ఓట్లను అభ్య ర్థించారు. చివరి రోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే తారక రామారావు సిరిసిల్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఓటర్లకు వాయిస్ కాల్ చేశారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రగతి, విద్య వైద్యం, వ్యవసాయం, సంక్షేమ పథకా లను ప్రస్తావిస్తూ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభ్యర్థులు కూడా చివరి వరకు వాయిస్ కాల్స్ వినిపించారు.
స్వశక్తి మహిళలు.. నేతన్నలపై గురి
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో అభ్యర్థులు ప్రధానంగా మహిళా ఓట్లపై దృష్టి పెట్టారు. రెండు మున్సిపాలిటీలో 1,22,836 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓట్లే అధికంగా ఉన్నాయి. పురుషులు 59,522 మంది, మహిళలు 63,290 మంది ఉన్నారు. పురుషుల ఓట్ల కంటే 5467 మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలో 63,290 మంది మహిళా ఓటర్లు ఉండగా వీరిలో స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 3,068 ఎస్‌హెచ్‌జీ సంఘాలు ఉండగా వీటిలో 31,353 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులందరూ ఓటు హక్కు కలి గిన వారే ఉండడంతో వారి ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ప్రధాన దృష్టి పెట్టారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 2,197 మహిళా సంఘాలు ఉండగా 22,146 మంది సభ్యులు, వేములవాడలో 871 సంఘాలు ఉండగా 9,207 మంది సభ్యులు ఉన్నారు. స్వశక్తి మహిళా సంఘాల సభ్యు లతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సంఘాల లీడర్ల ద్వారా ఓట్లు రాబట్టుకోవడానికి దృష్టి పెట్టారు. స్వశక్తి సంఘాల ద్వారా సభ్యులకు నజరా నాలు అందించి ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వాత సిరిసిల్లలో నేత కార్మికుల ఓట్లు గెలుపు ఓటమిలపై ప్రభావం చూప నున్నాయి. సిరిసిల్లలో 39942 పుురుషుల ఓట్లు ఉన్నా యి. ఇందులో నేతకార్మికుల ఓట్లు 25 వేల పైన ఉంటాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్య ర్థులు ప్రధానంగా మహిళలు, నేత కార్మికుల పైన దృష్టి పెట్టారు. సిరిసిల్లలో నేత కార్మికుల ఓట్ల కోసం మ్యాక్స్ సంఘాల వారీగా గంపగుత్తగా ఓట్లు రాబ ట్టాలని భావిస్తున్నారు.