గమ్యం చేరని పయనం
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:45 AM
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వాహన దారుల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలో ఈ యేడాది తొలి ఏడు నెలల్లోనే 238 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 78 మంది మృతిచెందగా, 140 మంది తీవ్ర గాయాలపాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
జగిత్యాల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వాహన దారుల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలో ఈ యేడాది తొలి ఏడు నెలల్లోనే 238 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 78 మంది మృతిచెందగా, 140 మంది తీవ్ర గాయాలపాలు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ దాదాపుగా ఉండడం లేదు. జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులే కాకుండా గ్రామీణ రహదారులపైనా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 63వ నంబరు, 563వ నంబరు జాతీయ రహదారులపై చాలా చోట్ల రాంగ్ రూట్లో వెళ్లడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం తదితర కారణాల వల్ల వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు గ్రామీణ రహదారులపై రోడ్డు దాటే క్రమంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
చిన్న పొరపాట్లతో ప్రమాదాలు...
రహదారి భద్రత విషయంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌ల ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడు తున్నారు. రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి వాటిని సరి చేస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా జరిగే ప్రమాదం మొత్తం కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేస్తోంది. త్వరగా వెళ్లాలన్న ఆలోచనతో వేగంగా వాహనాలు నడుపుతుండడంతో పలువురు గమ్యం చేరకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నవారు కొందరైతే, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్న వారు మరొకొందరు ఉన్నారు.
నియంత్రణలు చర్యలు చేపడుతున్నా...
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తోంది. ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలలో దొరికిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలూ పడుతున్నాయి. అయినప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడిపే వారు తగ్గడం లేదు. మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది మారడం లేదు. పోలీసుల తనిఖీలు జరుగుతాయన్న ఉద్దేశంతో రూట్లు మార్చి వెళ్తున్నారు.
అతివేగం, అజాగ్రత్తతోనే..
జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నీ అతివేగం, అజాగ్రత్త వల్లనే జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అభం, శుభం తెలియన పక్కవారు కూడా ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రమాదాల్లో కొన్ని ప్రమాదాలు మద్యం మత్తులో జరగగా, మరికొన్ని ప్రమాదాలు అతివేగం, అజాగ్రత్త వల్లనే జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలకు వ్యతిరేక దిశలో వెళ్లడం, వాహనాల ఓవర్ టేక్ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహధారులపైకి వాహనాలతో నేరుగా దూసుకు రావడం, విందు, శుభకార్యాలకు హాజరై మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు
- సత్యప్రసాద్, కలెక్టర్
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు చేపడు తున్నాము. ప్రమాదకర బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తుండడం, ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్షలు జరపాలని నిర్ణయించాము. జాతీయ రహదారులపై ఆక్రమణలు తొలగించి నిఘా, పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, స్పీడ్ డిటెక్టర్లు, కెమెరాలు, ఎమర్జెన్సీ కాల్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి సారించాము. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రద్దీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. వాహన చోదకులు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి.
నిబంధనలు కచ్చితంగా పాటించాలి
- అశోక్ కుమార్, ఎస్పీ
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన చోదకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, మద్యం మత్తు, నిద్రమత్తు, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించాలి. రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని సందర్బాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. రూ.లక్షల్లో వైద్యానికి వ్యయం చేయాల్సి వస్తోంది. వాహనం నడిపే సమయంలో నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు
---------------------------------------------------------
సంవత్సరం...ప్రమాదాలు...మరణాలు..క్షతగాత్రులు
2023 - 448 - 180 - 462
2024 - 466 - 189 - 436
2025 - 520 - 181 - 507
2026 - 238 - 78 - 140(ఇప్పటి వరకు)
----------------------------------------------------------
డ్రంకెన్‌డ్రైవ్ కేసులు..
2023 సంవత్సరంలో 5,831
2024 సంవత్సరంలో 7,058
2025 సంవత్సరంలో 9,290
2026 సంవత్సరంలో 2,162 (మార్చి వరకు)
-------------------------------------------------------