ప్రజల కోసమే.. ఆశీర్వాద యాత్ర
ABN , Publish Date - Mar 15 , 2026 | 01:12 AM
సమాజానికి మంచి చేయాలని, తమను గెలిపించిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుతూ అంజన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్నామని కేంద్ర హోం శాఖ సాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారుజ
కరీంనగర్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సమాజానికి మంచి చేయాలని, తమను గెలిపించిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుతూ అంజన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్నామని కేంద్ర హోం శాఖ సాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారుజ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రజా ప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు వస్తానని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించామన్నారు. దానికనుగుణంగా పార్లమెంట్ పరిధిలోని వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, వార్డు సభ్యులతో కలిసి మహాపాదయాత్ర చేపడుతున్నామన్నారు. నిత్యం కొలిచే మహాశక్తి అమ్మవారి ఆలయం నుంచే కొండగట్టుకు ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని, కష్టపడి చదివారని, ఇష్టపడి రాయాలన్నారు. పదో తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పాదయాత్ర చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తలపెట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో కాషాయ దళం కదం తొక్కింది. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమైన మహాపాదయాత్రలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ముందుకు సాగారు. డప్పు చప్పుళ్లు, భక్తి పాటలు, నృత్యాలు, కాషాయ జెండాలతో జై శ్రీరాం నినాదాలు చేస్తు తరలి వెళ్లారు. దారిపొడవునా పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎస్సారార్ కళాశాల, ఆర్టీసీ వర్క్‌షాపు, రేకుర్తితోపాటు, కొత్తపల్లి పట్టణంలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ గజమాలలతో స్వాగతం పలికారు. క్రేన్లు ఏర్పాటు చేసి గజ మాలలు మెడలో వేశారు. హనుమాన్ ఫ్లెక్సీని క్రేన్‌కు కట్టి దారి పొడవునా ఊరేగించారు. కొండగట్టుకు అంజన్న ఆశీర్వాద నేపథ్యంలో కరీంనగర్ మొత్తం కాషాయ మయమైంది. కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్స్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు వై సునీల్‌కుమార్, సంగప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సిరిసిల్ల అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, పార్లమెంట్ కన్వినర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అడుగులో అడుగేసి..
మండుటెండను లెక్కచేయక కేంద్రహోం శాఖ సమాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర శనివారం రాత్రి వరకు కొండగట్టుకు చేరుకుంది. ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమైన మహా పాదయాత్ర 11 గంటల్లో 40 కిలోమీటర్ల మేర నాయకులు, కార్యకర్తలతో కలిసి అంజన్న మొక్కులు చెల్లించుకున్నారు.
యాత్ర ప్రారంభమైందిలా..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 1.30కు కరీంనగర్ చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకు కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్ డిప్యూటీ మేయర్‌తో కలిసి వేలాది మది కాషాయ శ్రేణులు కాలి నడకన కొండగట్టుకు బయలుదేరారు.
మండుటెండలో..
రాజకీయాలకతీతంగా చేపట్టిన అధ్యాత్మిక యాత్ర కావడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ షూస్ వేసుకోకుండా సాక్సులతోనే కొండగట్టుకు పాదయాత్ర చేపట్టారు. మండుటెండలో తారు రోడ్డుపై సాక్సులతోనే నడక సాగించారు.
పదో తరగతి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా..
ఉదయం 9.30 గంటలకు ప్రారంభ కావాల్సిన పదో తరగతి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేపట్టారు. పదో తరగతి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా కరీంనగర్-జగిత్యాల రహదారి ఒకవైపు పాదయాత్ర చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు సూచనలు అందిస్తు యాత్రను చేపట్టారు. పాదయాత్ర చేపట్టే సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు పూర్తిగా సహకరించాలని పదే పదే కోరారు.
కోన్‌రావుపేటలో తేనెటీగల కలకలం
రామడుగు మండలం కోన్‌రావుపేట వద్దకు పాదయాత్ర చేరుకోగానే కార్యకర్తల కోలాహాలం, డిజే సౌండ్స్‌ల మధ్య కార్యకర్తలు డ్రోన్ ఎగురవేయడంతో ఓ చెట్టుపై ఉన్న తేనెతుట్టె కదిలి అందులో నుంచి తేనెటీగలు బయటకు రావడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పోరేటర్లు, మరో ముగ్గురు కాషాయ శ్రేణులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రామడుగు మండలం వెదిర వద్దకు చేరుకోగానే అప్పటికే అలసిపోయిన బండి సంజయ్ కొద్దిసేపు రోడ్డు పక్కనే ఉన్న బెంచిపై సేదదీరారు. అంబులెన్స్‌లోని వైద్యులు రోజువారీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు.
గంగాధరలో భోజనం
రామడుగు మండలం కోన్‌రావుపేట నుంచి బయలుదేరిన పాదయాత్ర 3.30కు గంగాధర చేరుకుంది. స్థానిక ఫంక్షన్ హాలులో కార్యకర్తలు, నాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. కాసేపు సేదతీరి సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను వెంకటాయపల్లి, పూడూరు మీదుగా కొండగట్టుకు చేరుకున్నారు. అంజన్న ఆశీర్వాద యాత్రను దిగ్విజయంగా ముగించి బీజేపీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు.
పాదయాత్రకు పలువురి సంఘీభావం
అంజన్న ఆశీర్వాద యాత్రకు బైంసా మున్సిపల్ యైుర్మన్ తుమ్మల దత్తాత్రితో పాటు కౌన్సిలర్లంతా హాజరై పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్స్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు వై సునీల్‌కుమార్, సంగప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, పార్లమెంట్ కన్వినర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.