మేడారం జాతరకు 410 బస్సులు..
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:39 PM
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథని బస్టాండ్లలో ప్రత్యేకించి జాతర క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 410 బస్సులను మేడారం నడపనున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథని బస్టాండ్లలో ప్రత్యేకించి జాతర క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 410 బస్సులను మేడారం నడపనున్నారు. క్యాంపు ప్రాంగణాలను చదును చేసి బారికేడ్లను నిర్మించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టెంట్లు వేయనున్నారు. మంచి నీటి సౌకర్యంతో పాటు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. 2024లో జరిగిన జాతర కంటే ఈసారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం వెళ్లే అవకాశాలు ఉండడంతో బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. జిల్లాలో గోదావరిఖని, మంథని బస్ డిపోలు ఉండగా, గోదావరిఖని, మంథనితో పాటు పెద్దపల్లి బస్టాండ్ నుంచి కూడా బస్సులు నడుపుతున్నారు. పెద్దపల్లి నుంచి 175 బస్సులు, గోదావరిఖని నుంచి 115 బస్సులు, మంథని నుంచి 170 బస్సులను నడుపుతున్నారు. స్థానికంగా ఉన్న బస్సులతో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల డిపోల నుంచి బస్సులను ఇక్కడి నుంచి నడపనున్నారు. పెద్దపల్లి క్యాంపు ఇన్‌చార్జీగా జగిత్యాల డిపో మేనేజర్ కల్పన, గోదావరిఖని క్యాంపు ఇన్‌చార్జీగా డీఎం నాగభూషణం, మంథని క్యాంపు ఇన్‌చార్జీగా డీఎం శ్రావణ్ కుమార్ వ్యవహరించనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. అన్ని క్యాంపుల నుంచి 25వ తేదీ నుంచే ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటికే జిల్లా నుంచి అనేక మంది భక్తులు మేడారం వెళ్లి వస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సుల్లో వెళ్లే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. 2024లో జరిగిన జాతర సందర్భంగా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లుగానే ప్రస్తుతం కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పురుషులకు ప్రత్యేక సర్వీస్ చార్జీలను వసూలు చేయనున్నారు. పెద్దపల్లి నుంచి పెద్దలకు 420, పిల్లలకు 240 రూపాయలు, గోదావరిఖని నుంచి పెద్దలకు 400, పిల్లలకు 230 రూపాయలు, మంథని నుంచి పెద్దలకు 350, పిల్లలకు 210 రూపాయల చార్జీ నిర్ణయించారు.
ప్రస్తుతం డైరెక్టు బస్సులు లేక ఇక్కట్లు..
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు సాగుతున్నప్పటికీ, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఈ నెల 25వ తేదీ నుంచి భక్తుల సంఖ్యను బట్టి నడపాలని నిర్ణయించారు. అయితే గత నెల రోజుల నుంచి మేడారంకు భక్తులు వెళ్లి వస్తున్నారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే భావనతో ఐదు రోజుల నుంచి అనేక మంది భక్తులు మేడారం వెళ్లి వస్తున్నారు. ఆయా డిపోల నుంచి డైరెక్టు బస్సులు లేక భక్తులు ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకుని వెళ్లి వస్తున్నారు. మరికొందరు భక్తులు మంథని మీదుగా కాటారం, భూపాలపల్లి, ములుగు మీదుగా మేడారం వరకు ఆయా బస్సులు ఎక్కుతూ, దిగుతూ నానా తంటాలు పడుతున్నారు. డైరెక్టుగా కాకపోయినా కొన్ని చోట్ల హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తూ బస్సులు నడిపితే బాగుండేదని ప్రయాణికులు అభిప్రాయ పడుతున్నారు. పెద్దపల్లి, గోదావరిఖని నుంచి వెళ్లే బస్సులకు మంథని, కాటారం, భూపాలపల్లి, మంథని నుంచే వెళ్లే బస్సులకు కాటారం, భూపాలపల్లి హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తే భక్తులకు ఇబ్బందులు ఉండేవి కావని అంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పెద్దపల్లి, గోదావరిఖని, మంథని బస్టాండ్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులను నడిపించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..
- జగిత్యాల డీఎం కల్పన
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి క్యాంపు ఇన్‌చార్జీ జగిత్యాల డీఎం కల్పన తెలిపారు. మంగళవారం ఆమె కోరుట్ల, సిరిసిల్ల డీఎంలు మనోహర్, ప్రకాశరావులతో కలిసి పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో నిర్మించనున్న బస్ డిపో స్థలంలో ఏర్పాటు చేసిన జాతర క్యాంపులో ఏర్పాట్లను పరిశీలించారు. బస్టాండ్ లోపలి భాగం నుంచి బారేకేడ్ల నుంచి జాతర క్యాంపులోకి వెళ్లి టిక్కెట్లు తీసుకుని ఆ వెంటనే బస్సు ఎక్కే విధంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కంట్రోలర్లు కె రాంగోపాల్ రెడ్డి, తదితరులను ఆదేశించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ పెద్దపల్లి బస్టాండ్ నుంచి గతంలో కంటే ఈసారి 175 బస్సులను నుడపుతున్నామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. ఆమె వెంట కంట్రోలర్లు, సిబ్బంది ఉన్నారు.