జిల్లాలో 3,44,091 గృహాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:39 AM
జనగణనలో తొలి అంకం పూర్తయింది. ఇందులో గృహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగా జిల్లావ్యాప్తంగా 3,44,091 గృహాలున్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 85,452 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,58,639 ఇళ్లను గుర్తించారు. జనాభా లెక్కల్లో భాగంగా మొదటి విడతగా ఇళ్ల లెక్కింపు కోసం 299 మంది సూపర్‌వైజర్లు, 1,755 మంది ఎన్యూమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించారు.
జగిత్యాల, జూన 13 (ఆంధ్రజ్యోతి): జనగణనలో తొలి అంకం పూర్తయింది. ఇందులో గృహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగా జిల్లావ్యాప్తంగా 3,44,091 గృహాలున్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 85,452 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,58,639 ఇళ్లను గుర్తించారు. జనాభా లెక్కల్లో భాగంగా మొదటి విడతగా ఇళ్ల లెక్కింపు కోసం 299 మంది సూపర్‌వైజర్లు, 1,755 మంది ఎన్యూమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించారు. కాగా ఫిబ్రవరి-2027లో జనాభాను లెక్కించునున్నారు. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
29 రోజుల పాటు కొనసాగిన సర్వే..
జనగణన కార్యక్రమంలో భాగంగా తొలుత గృహగణన కార్యక్రమాన్ని మే 11వ తేదీ నుంచి జూన 9వ తేదీ వరకు డిజిటల్ విధానంలో ఎన్యూమరేటర్లు సర్వే చేపట్టారు. జిల్లాలో 1,977 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించి ప్రతీ బ్లాక్‌లో 250 నుంచి 300 గృహాలు సర్వే చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతీ 300 గృహాలకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున 370 మందికి పైగా నియమించి జిల్లాలో గృహగణన నిర్వహించారు. గృహ గణనలో ఎన్యూమరేటర్ ప్రతీ ఇంటికి వెళ్లి 33 అంశాలకు సంబధించిన సమాచారాన్ని సేకరించి ఆనలైనలో నమోదు చేశారు.
వంద శాతం గృహగణన పూర్తి..
జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల్లో గృహగణన వంద శాతం పూర్తయింది. జిల్లా పరిధిలో 3,44,091 గృహాలను ఎన్యూమరేటర్లు గుర్తించారు. వేసవి కాలంలో మండుటెండలో సైతం గృహగణన కార్యక్రమాన్ని చేపట్టి వంద శాతం పూర్తి చేశారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో జనగణన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే గృహగణన కార్యక్రమాన్ని జూన 9వ తేదీ వరకు పూర్తి చేశారు. ఫిబ్రవరి 2027లో జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు.
జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికం..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో 85,452 గృహాలను ఎన్యూమరేటర్లు గుర్తించారు. ఇందులో జగిత్యాల మున్సిపాలిటీల్లో 34,189 గృహాలు, కోరుట్లలో 23,405 గృహాలు, మెట్‌పల్లిలో 16,959 గృహాలు, రాయికల్‌లో 5,564 గృహాలు, ధర్మపురిలో 5,335 గృహాలు సర్వేలో గుర్తించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 2,58,639 గృహాలు లెక్కించారు. ఇందులో బీర్‌పూర్ మండలంలో 7,912 గృహాలు, బీమారంలో 7,189, బుగ్గారంలో 8,121, ధర్మపురిలో 14,987, ఎండపల్లిలో 10,359, గొల్లపల్లిలో 16,258, ఇబ్రహీంపట్నంలో 13,950, జగిత్యాల రూరల్‌లో 19,627, జగిత్యాల అర్బనలో 4,156, కథలాపూర్‌లో 15,251, కొడిమ్యాలలో 15,447, కోరుట్లలో 13,227, మల్యాలలో 17,463, మల్లాపూర్‌లో 17,877, మేడిపల్లిలో 10,147 గృహాలు ఎన్యూమరేటర్లు లెక్కించారు. అదేవిధంగా మెట్‌పల్లిలో 15,444, పెగడపల్లిలో 15,433, రాయికల్‌లో 17,784, సారంగాపూర్‌లో 8,847, వెల్గటూరులో 9,160 గృహాలు ఎన్యూమరేటర్లు లెక్కించారు.
డిజిటల్ విధానంలో నమోదు...
ప్రస్తుతం డిజిటల్ విధానంతో పాటు స్వయంగా ప్రజలే వారి వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26వ తేదీన మొదలు కాగా గత నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా సుమారు 13 వేల మందికి పైగా తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్యూమరేటర్లు ఇళ్ల లెక్కింపుతో పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన చేసుకున్న వివరాలను పరిశీలించారు.
రెండు విడతల్లో..
ప్రతీ పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం జనాభాను లెక్కిస్తోంది. కోవిడ్ తదితర కారణాలతో 2021లో చేపట్టాల్సిన ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ప్రస్తుతం చేపడుతున్నారు. జనగణన ప్రక్రియ రెండు విడుతల్లో చేపట్టనున్నారు. మొదటి విడతగా ఇళ్ల లెక్కింపు, తర్వాత జనాభా లెక్కింపు చేయనున్నారు. గతనెల 11వ తేదీ నుంచి జల్లాలోని ఇళ్లను లెక్కించేందుకు యంత్రాంగం ముందుకు వెళ్లింది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఇదిలాఉండగా 2011లో నిర్వహించిన లెక్కలు ప్రకారం జగిత్యాల జిల్లాలో 9,85,417 మంది జనాభా ఉన్నారు. వీరిలో పురుషులు 4,84,079 మంది, మహిళలు 5,01,338 మంది ఉన్నారు. జిల్లాలో 2,53,619 ఇళ్లు ఉన్నాయి.