Share News

2029 నాటికి డ్రగ్స్‌ ముక్త్‌ భారత్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:09 AM

దేశంలో 2029 నాటికి మాదకద్రవ్యాల సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు

2029 నాటికి డ్రగ్స్‌ ముక్త్‌ భారత్‌
Kishan Reddy

  • భవిష్యత్‌ తరాలను రక్షించుకొనేందుకే నషా ముక్త్‌ భారత్‌ యాత్ర

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

  • డ్రగ్స్‌ అంతం.. మన పంతం: సంజయ్‌

  • రెండో రోజు యాత్రలో పాల్గొన్న సినీ, క్రీడా ప్రముఖులు

ముషీరాబాద్‌/చిక్కడపల్లి/అమీర్‌పేట్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో 2029 నాటికి మాదకద్రవ్యాల సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రచారం కోసమో, సోషల్‌ మీడియాలో లైకుల కోసమో, బ్రేకింగ్‌ న్యూస్‌ కోసమో తాను నషా ముక్త్‌ భారత్‌ పాదయాత్ర చేయడం లేదని అన్నారు. మన సమాజాన్ని, భవిష్యత్‌ తరాలను రక్షించుకునేందుకు నిబద్ధతతో యాత్ర చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన చేపట్టిన నషా ముక్త్‌ భారత్‌ పాదయాత్ర గురువారం రెండోరోజు కొనసాగింది. ముషీరాబాద్‌లోని కశిష్‌ హాల్‌ నుంచి ప్రారంభమైన యాత్ర ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, ఖైరతాబాద్‌, పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్‌ వరకు సాగింది. యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రకు అన్నివర్గాల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే 2029 నాటికి దేశంలో డ్రగ్స్‌ మహమ్మారి పూర్తిగా నిర్మూలన అవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. వికారాబాద్‌ అడవుల్లో కొంతమంది ద్రోహులు రైతులకు ఎకరాకు రూ.2-3 లక్షల ఆదాయం వస్తుందని ఆశచూపి మెడిసినల్‌ ప్లాంట్స్‌ పేరుతో గంజాయిని సాగుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఫారెస్టు అధికారులు సైతం వెళ్లలేని దట్టమైన అడవుల్లో గంజాయిని సాగుచేస్తూ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బస్తీలు, కాలనీల్లో గంజాయి చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో లభిస్తుండడంతో యువత పాడైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ ముక్త్‌ భారత్‌ కోసం ప్రతి విద్యార్థి వారియర్‌గా మారాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ అంతం మనందరి పంతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ నిర్మూలన ప్రభుత్వాలతోనే సాధ్యం కాదని, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. మనకు మన రాష్ట్రం వచ్చింది కానీ.. మన యువతను డ్రగ్స్‌ మాఫియా నుంచి పూర్తిగా కాపాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ పరిధిలో 169 డ్రగ్స్‌ కేసులు మాత్రమే నమోదైతే.. కేసీఆర్‌ పాలనలో 2023లో 1,487 కేసులు నమోదయ్యాయని విమర్శించారు. ఇప్పుడు ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. పుల్లెల గోపిచంద్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ మహమ్మారిపై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం యాత్ర ముగింపు సందర్భంగా సినీ నటులు చిరంజీవి, నాగార్జున, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ హాజరుకానున్నారు. రెండోరోజు యాత్రలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, దేవనాథ్‌ జియర్‌ స్వామిజీ, నటి రష్మికా ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 27 , 2026 | 06:16 AM