పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. కేంద్రంపై టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం..
ABN , Publish Date - May 15 , 2026 | 02:53 PM
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపిందని మండిపడ్డారు.
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను మళ్లీ పెంచిన మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఆగ్రహించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రజలపై మరింత భారంగా మారిందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయని, దేశంలో మాత్రం పెట్రోల్ రేట్లను పెంచి కేంద్రం దోచుకుంటోందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వ చర్యలతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందన్నారు. చివరకు సామాన్యుడు తీవ్రంగా నష్టపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలకే పరిమితమైందని ఆయన విమర్శించారు.
ప్రజా సంక్షేమం కంటే పన్నుల వసూళ్లపైనే మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
మెరుపు దగా.. కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున్న వ్యాపారులు