లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:24 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 22: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితోపాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆదివారం ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబీ ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్ జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రెటరీ జనరల్‌గా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మరణించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవీజీ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జన జీవన స్రవంతిలో కలిసి.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలుపునిచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొంత మంది ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్టయ్యారు. మరికొంత మంది ప్రభుత్వం ఎదుట లొంగిపోలేదు. మరోవైపు ఆపరేషన్ కగార్ కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది.
అలాంటి వేళ.. మావోయిస్టుల కోసం వారి ప్రభావిత రాష్ట్రాల్లో భద్రత బలగాలు.. జల్లెడ పడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్ జీతోపాటు పలువురి నేతలు ప్రవేశించారంటూ నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో కర్రెగుట్టలో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మరణించారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారంటూ చర్చ జరిగింది. దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల్లో కూబింగ్ నిర్వహించారంటూ ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ప్రచారం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కామారెడ్డి వెళ్లి తీరుతాం: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
For TG News And Telugu News