సీజనల్ పరిస్థితులు, నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:22 PM
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ పరిస్థితులు, ప్రజలకు అవసరమైన సేవలు, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్లతో ఆయన సమీక్షించారు.
హైదరాబాద్, ఆగస్టు 25: రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ పరిస్థితులు, ప్రజలకు అవసరమైన సేవలు, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ఆయా అంశాలపై చేపడుతున్న చర్యలను కలెక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని వారికి సీఎస్ సూచించారు. వర్షాలు, వరదలు నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇక నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా తదితరత అంశాలపై అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ఈ ప్రవేశపరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.