Share News

సర్‌కు సన్నాహాలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:00 AM

రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌- ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం చేపట్టనుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అర్హులను ఎలా నిర్ధారిస్తారు......

సర్‌కు సన్నాహాలు

  • వచ్చే నెల రాష్ట్రంలో ప్రక్రియ ప్రారంభం

  • రెండు ఓట్లు ఉంటే ఒకటి రద్దు

  • 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో కనీసం ఒకటి చూపించాలి

  • ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు

  • పార్టీల ఏజెంట్లకూ ప్రమేయం

  • లోపాలపై అప్పీలుకు అవకాశం

  • వివరణ తీసుకున్నాకే పేరు తొలగింపు

  • కొత్త ఓటర్ల నమోదు.. గరిష్ఠంగా 1200 మంది ఉండేలా పోలింగ్‌ బూత్‌ల హేతుబద్ధీకరణ

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌- ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం చేపట్టనుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అర్హులను ఎలా నిర్ధారిస్తారు, ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి, రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే ఎక్కడ రద్దుచేసుకోవాలి.. వంటి అంశాలపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. బిహార్‌లో తొలుత ప్రయోగాత్మకంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టగా రెండో విడతలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించింది. ఏప్రిల్‌ నెలలో మూడో విడత కింద తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత పాలిత ప్రాంతాల్లో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నాలుగు నెలల వ్యవధిలో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటర్ల పేర్ల నమోదు, తొలగింపులతో సరిపెట్టకుండా ఓటరు జాబితాలను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించడం ‘సర్‌’ ప్రత్యేకత. అనర్హుల (మరణించిన వారు, విదేశీయుల) పేర్లను తొలగించడంతోపాటు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవతరం పేర్లను నమోదు చేసుకునేందుకు దీని ద్వారా అవకాశం కలిగింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1000-1200 మంది ఓటర్లు ఉండేలా చూ’స్తారు. ఇంటింటికి వెళ్లి వారి వివరాలను సేకరించేందుకు బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓ) ఉంటారు.


ధ్రువపత్రాల పరిశీలన తప్పనిసరి

బీఎల్‌ఓ ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించడంతోపాటు వారి అర్హతను నిర్ణయించేందుకు తగిన పత్రాలను పరిశీలిస్తారు. తొలుత పేర్ల నమోదుకు సంబంధించి ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫారాలు తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయి దా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాలో లేని పేర్లు (మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్‌ ఓట్లు) వివరాలను ప్రత్యేకం గా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను ఈఆర్‌ఓ (ఎన్నికల న మోదు అధికారి) స్థాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. విచారణ అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఒకవేళ అధికారుల నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్‌, సీఈఓకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6 ఇవ్వడం, డిక్లరేషన్‌ ఫారాలను ేసకరించడం. ఎన్యుమరేషన్‌ ఫారం పూరించడంలో ఓటర్లకు సహాయం చేయడం, వాటిని సంబంధిత ఈఆర్‌ఓ/ఏఈఆర్‌ఓలకు సమర్పించడం వంటివి బీఎల్‌ఓ విధులుగా ఉన్నాయి. ఈ లెక్కన వారు ప్రతి ఓటరు ఇంటిని కనీసం నాలుగుసార్లు సందర్శించాల్సి ఉంటుంది. జాబితా సవరణలో రాజకీయ పార్టీలనూ భాగస్వామ్యం చేశారు. గుర్తింపు పొందిన పా ర్టీల ఏజెంట్లు రోజుకు 50 ఫారాల వరకు ఓటర్ల నుంచి సకరించి బీఎల్‌ఓలకు అందజేయాల్సి ఉంటుంది.

డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు తప్పనిసరి

చట్ట ప్రకారం ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను సవరించడం తప్పనిసరి. అయితే వలసలు, ఇతర కారణాల వల్ల చాలా మందికి రెండు చోట్ల ఓట్లు ఉంటున్నాయని, మరణించిన వారి పేర్లు తొలగించడం లేదని, రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ లోపాలను సవరించి, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందించేందుకే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.


ఎవరి పేర్లు తొలగిస్తారు?

ఓటరు మరణించినట్లు సమాచారం ఉంటే ఆ పేరు తొలగిస్తారు. ఇతర ప్రాంతానికి శాశ్వతంగా మారి, అక్కడే ఓటరుగా నమోదు చేసుకుని ఉంటే పాత ప్రాంతంలో పేరు తొలగిస్తారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదు అయితే దాన్ని డూప్లికేట్‌గా పరిగణించి ఒకటి రద్దుచేస్తారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే అసలైన నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఒకదానిని ఉంచి, మరోదాన్ని తొలగిస్తారు. రెండింటికీ ధ్రువ పత్రాలు ఉంటే ఓట రు ఇష్టం మేరకు ఒకదానిని ఉంచి, మరోదాన్ని రద్దు చేస్తారు. భారత పౌరసత్వం లేనివారు, భారత పౌరు డు కానివారి పేర్లు రద్దు చేస్తారు. తప్పుడు పత్రాలు, వివరాలతో ఓటరుగా నమోదయితే దాన్నీ రద్దు చేస్తారు. 18ఏళ్లు నిండకపోయినా, నేరాలు చేసి కోర్టు తీరువల్ల ఎన్నికల హక్కులను కోల్పోయినా ఓటు హక్కు రద్దవుతుంది. ఓటరు పేరు తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి నోటీసు ఇస్తారు. వివరణను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు, గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా పోలింగ్‌ కేంద్రాలను కూడా హేతుబద్ధీకరణ చేయాలని ఈసీ భావిస్తోంది. మురికివాడలు, హై-రైజ్‌ అ పార్ట్‌మెంట్లు, కాలనీల్లో కొత్తగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరినీ ఒకేపోలింగ్‌ కేంద్రం పరిధిలోకి తీసుకురావడం వంటి లక్ష్యాలను పెట్టుకొంది. జాబితాలో పేర్ల నమోదుతో పాటు, వాటిని సక్రమంగా తనిఖీలు చేసి సహకరించాలని ఓటర్లను ఎన్నికల సంఘం కోరింది.


12 రకాల గుర్తింపు పత్రాలు

  • బీఎల్‌ఓలు ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు గుర్తింపు కోసం 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఒక దాన్నయినా సమర్పించాల్సి ఉంటుంది. అధికారులకు అనుమానాలు వచ్చినప్పుడు మరికొన్ని పత్రాలను చూపించాలని అడిగే అవకాశం ఉంది.

  • ఉద్యోగుల గుర్తింపు కార్డు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు, రిటైర్‌ అయిన వారికి ఇచ్చే అధికారిక గుర్తింపు కార్డు.

  • పౌరసత్వ రుజువు పత్రం - 1987 జూలై 1 కంటే ముందు భారత ప్రభుత్వం, బ్యాంకులు, పోస్టాఫీసు వంటి సంస్థలు జారీచేసిన ఏవైనా పత్రాలను పాత నివాస, పౌరసత్వ రుజువుల కోసం సమర్పించాల్సి ఉంటుంది.

  • జనన ధ్రువీకరణ పత్రం - మున్సిపాలిటీ, పంచాయతీలు జారీచేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. (దీన్ని వయస్సు, పుట్టిన ప్రదేశానికి ప్రాథమిక ఆధారంగా పరిగణిస్తారు).

  • పాస్‌ పోర్ట్‌ - విదేశీ ప్రయాణాల కోసం భారత ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. దీన్ని పౌరసత్వం గుర్తింపుగా నిర్ణయిస్తారు.

  • విద్యార్హత ధ్రువీకరణ పత్రం - ఎస్సెస్సీ, ఇంటర్‌బోర్డు, యూనివర్సిటీలు జారీచేసిన మార్కుల జాబితా. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. వీటిలో పుట్టిన తేదీ, తండ్రి పేరు స్థానికత వంటి వివరాలు ఉంటాయి.

  • శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం - నిర్దిష్ట రాష్ట్రంలో శాశ్వతంగా నివసిస్తున్నారని ధ్రువీకరిస్తూ రెవెన్యూ అధికారులు (తహశీల్దార్‌ వంటి వారు) ఇచ్చే పత్రం.

  • అటవీ హక్కు పత్రం - అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, సంప్రదాయ అటవీ నివాసులకు, ఆ భూమిపై, అటవీ వనరులపై ఉన్న హక్కును గుర్తిస్తూ ఇచ్చే పత్రం.

  • కుల ధ్రువీకరణ పత్రం - ఏ సామాజిక వర్గానికి చెందుతారో ధ్రువీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసే పత్రం.

  • నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ - ఇది భారతీయ పౌరులందరి వివరాలను కలిగి ఉండే రిజిస్టర్‌. ప్రస్తుతం ఇది అసోం వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలులో ఉంది.

  • కుటుంబ రిజిస్టర్‌ - గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో నిర్వహించే రిజిస్టర్‌, ఇందులో కుటుంబ సభ్యులందరి వివరాలు ఉంటాయి.

  • భూమి/ఇంటి కేటాయింపు పత్రం - ప్రభుత్వం ఏదైనా ఇల్లు/ భూమిని కేటాయించినప్పుడు ఇచ్చే ‘అలాట్‌మెంట్‌ లెటర్‌’. దీన్ని నివాస రుజువుగా నిర్ణయిస్తారు.

  • ఆధార్‌ కార్డు - 2025 సెప్టెంబరు 9 నాటి ప్రత్యేక నిబంధనల ప్రకారం 12 అంకెలతో కూడిన ఆధార్‌కార్డును పరిగణనలోకి తీసుకుంటారు.

Updated Date - Mar 11 , 2026 | 05:00 AM