Share News

రాష్ట్రంలో కొత్త, మహిళా నాయకత్వం పెరిగే సూచన..

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:35 AM

తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం పెరగనుందా!? అసెంబ్లీ మూడో వంతుకుపైగా మహిళలతోనే నిండనుందా!? ఇందుకు అనుగుణంగానే, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి .........

రాష్ట్రంలో కొత్త, మహిళా నాయకత్వం పెరిగే సూచన..

  • నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం కోటా కారణం

  • రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది అతివలకు అవకాశం

  • ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారికి అదృష్టమే

  • కొత్తగా రావాలని అనుకునే వారికి సువర్ణావకాశం

  • సతీమణులు, కుమార్తెలు, కోడళ్లను రంగంలోకి దించడానికి ఇప్పటికే పావులు కదుపుతున్న నేతలు

హైదరాబాద్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం పెరగనుందా!? అసెంబ్లీ మూడో వంతుకుపైగా మహిళలతోనే నిండనుందా!? ఇందుకు అనుగుణంగానే, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు పావులు కదుపుతున్నారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య 179కి, లోక్‌సభ స్థానాల సంఖ్య 26కు పెరగవచ్చని ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితోపాటు, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తే.. దాదాపు 60 మంది మహిళలకు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం దక్కనుంది. ప్రస్తుత శాసనసభలో ఇద్దరు మంత్రులు సహా పదిమంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇది మొత్తం సభ్యుల సంఖ్యలో కేవలం 8 శాతం మాత్రమే. ఇక, లోక్‌సభలోనూ ఎనిమిదిమంది మహిళలకు అవకాశం దక్కనుంది. వెరసి, ఇప్పటికే ఉన్న పదిమందికితోడు మరో 60 మంది వరకూ మహిళల్లో కొత్త తరం రాజకీయాల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, ప్రధాన పార్టీల్లోని సీనియర్లు తమ కుటుంబ ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు, మహిళా వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. కొందరు ఇప్పటికే క్రియాశీలంగా పని చేస్తున్నారు కూడా. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా దంపతుల కుమార్తె సుష్మిత, రంగారెడ్డి జిల్లా మాజీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, అన్నపూర్ణమ్మ, అరుణతార, కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల, కుమార్తె, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయారెడ్డి తదితరులు రాజకీయాల్లో ఇప్పటికే క్రియాశీలంగా ఉన్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లు కలిసి వస్తే పోటీకి వీరంతా సిద్దంగా ఉన్నారు కూడా.


ఇక, అవకాశం వస్తే ఈసారి పోటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి సై అంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు కోడలు డాక్టర్‌ దీప, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌ రెడ్డి చిన్న కోడలు చరిష్మా రెడ్డి; మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కోడలు దివ్యారెడ్డి; మంత్రి సీతక్క కోడలు కుంజ పుష్పాంజలి; బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భార్య జ్యోతి; మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భార్య లక్ష్మి; మంత్రి వెంకట్‌రెడ్డి సతీమణి సబిత, కుమార్తె ప్రణతి తదితరులు సైతం రిజర్వేషన్లు అనుకూలిస్తే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. నిజానికి, తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ సీట్లు పెరగడమే కాకుండా అంతే సంఖ్యలో మహిళలకు అవకాశాలు దక్కనున్నాయి. దాంతో, ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలంగా పని చేస్తున్న మహిళా నాయకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇక, రాజకీయ కుటుంబాలకు చెందిన నాయకులు కూడా తమ వారసురాళ్లను బరిలోకి దింపేందుకు ఉత్సుకత చూపే అవకాశాలున్నాయి. వెరసి, రాష్ట్రంలో కొత్త నాయకత్వం.. అందులోనూ మహిళా నాయకత్వం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Updated Date - Mar 28 , 2026 | 06:33 AM