రేవంత్ సర్కార్‌లో వచ్చిన 3,82,000 కోట్ల ఒప్పందాలివే!
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:59 AM
తెలంగాణను గ్లోబల్ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమం స్పష్టమైన ఫలితాలిస్తోంది.
ఇప్పటికే డీపీఆర్‌లను పంపిన 30కి పైగా కంపెనీలు
డేటా సెంటర్ రంగంలోనే 1,52,250 కోట్ల పెట్టుబడులు
ఎలకా్ట్రనిక్స్ రంగంలో రూ.16,000 కోట్ల ఒప్పందాలు
మౌలిక సదుపాయాల కల్పన రంగంలో 1,11,000 కోట్ల ఒప్పందాలు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను గ్లోబల్ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమం స్పష్టమైన ఫలితాలిస్తోంది. దానికోసం ప్రభుత్వం ఒక డాక్యుమెంట్‌ను రూపొందించి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో రెండ్రోజుల సదస్సు, మూడుసార్లు సీఎం దావోస్ పర్యటనల్లోనూ సదస్సులు నిర్వహించింది. ప్రతి వేదికపైనా సీఎం రేవంత్, క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు 2047 విజన్‌లో భాగంగా మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిలపాలన్నదే తమ లక్ష్యంగా చెబుతూవస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై విశ్వాసం బాగా పెరిగిందని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగానే మొత్తం రూ.3.82 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ పెట్టుబడులు కేవలం ఒప్పందాల స్థాయిలోనే కాకుండా, అమలు దశలోకి వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, అనేక ప్రాజెక్టులు ఇప్పటికే ఆపరేషనల్ దశకు చేరుకోగా, మరికొన్ని నిర్మాణదశలో ఉండటం, ఇంకొన్ని డీపీఆర్ సమర్పణతో అమలుకు సిద్థంగా ఉండటం రాష్ట్ర పారిశ్రామిక వృద్థికి బలమైన సంకేతంగా నిలుస్తోంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 30కి పైగా కంపెనీలు డీపీఆర్‌లను ప్రభుత్వానికి పంపించాయి. ఇక రంగాల వారీగా చూస్తే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉంది. ఆటోమొబైల్, ఈవీ వాహనాల రంగాల్లో కూడా గణనీయమైన పెట్టుబడులొచ్చాయి. వీటికి అవసరమైన భూములు ఇప్పటికే కేటాయించగా, ఎక్కువ యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రీన్ మొబిలిటీపై రాష్ట్రం దృష్టి పెట్టడంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే పునరుత్పాదక శక్తి రంగంలో రూ.31,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం గమనార్హం.
డేటా సెంటర్లదే హవా
డేటా సెంటర్ల రంగంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్లను రాష్ట్రంలో నెలకొల్పి ఏఐ, డేటాసెంటర్ల రంగానికి తెలంగాణను హబ్‌గా మార్చాలనుకుంది. అందులో భాగంగానే కీలక ముందడుగు పడింది. సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ, ఇన్‌ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ వంటి భారీ స్థాయి కంపెనీలు ముందుకొచ్చాయి. అందుకే కేవలం డేటా సెంటర్‌ల రంగంలోనే రాష్ట్రానికి 1,52,250 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. ఇందులో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలు డీపీఆర్‌లు కూడా ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లకు భూకేటాయింపులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ డేటా సెంటర్ల ప్రాజెక్ట్‌లు పూర్తయి అమలు దశలోకి వస్తే యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దాంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో కూడా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. రూ.150 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడులతో అనేక యూనిట్లు ఏర్పడుతున్నాయి. వీటిలో చాలా ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించగా, కొన్ని ఇప్పటికే పనులు ప్రారంభించాయి. వస్త్ర రంగంలో రూ.3వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ యూనిట్లు వస్తున్నాయి.
ఫార్మా, బయోటెక్ రంగాల్లో మరింత బలపడుతున్న తెలంగాణ
ఎలక్ర్టానిక్స్ రంగంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మౌలిక సదుపాయాల రంగంలో కూడా భారీ స్థాయిలో రూ.1,11,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకం కానుంది. ఫార్మా, బయోటెక్ రంగాల్లో తెలంగాణ స్థానం మరింత బలపడుతోంది. రూ.1,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు పెట్టుబడులతో కొత్త యూనిట్లు, ఇప్పటికే ఉన్న కంపెనీలు వాటి విస్తరణ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. సంగారెడ్డి వంటి చోట్ల భూముల కేటాయింపులు పూర్తవడంతో అనేక ప్రాజెక్టులు అమలు దశలోకి వచ్చాయి. బయోటెక్, ఆర్ అండ్ డీ రంగాల్లో ఆధునిక సదుపాయాలతో కొత్త కేంద్రాలు ఏర్పడుతున్నాయి. మొత్తంగా పరిశీలిస్తే, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కాకుండా, భూముల కేటాయింపులు, నిర్మాణ పనులు, ఆపరేషనల్ దశల వరకు వేగంగా ముందుకు సాగుతున్నాయి. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం, వేగవంతమైన అనుమతులు, వంటి అంశాలు తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా నిలబెడుతున్నాయి. ‘తెలంగాణ రైజింగ్’ కేవలం నినాదం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా స్పష్టమైన మార్పులను తీసుకొస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.