విప్లవ పోరాటానికి ముగింపు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:54 AM
తెలంగాణలో రూపుదిద్దుకున్న మావోయిస్టు విప్లవ పోరాటం ఇక్కడే ముగుస్తోందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలను గమనించి మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు.....
దేవ్‌జీ సహా నలుగురు అగ్రనేతల లొంగుబాటు
మావోయిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణం పతనం
రాష్ట్ర ప్రభుత్వ పునరావాస చర్యలతో లొంగుబాట్లు
పార్టీలో తెలంగాణకు చెందినవారు ఇంకా 11 మంది
వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి: డీజీపీ
డీజీపీ సమక్షంలో లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి
అనారోగ్యంతోనే రహస్య జీవితం వదిలాం.. ప్రజా సమస్యలపై ఇకపైనా పోరాటాలు చేస్తాం: దేవ్‌జీ
నేపాల్‌లో గణపతి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు?
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రూపుదిద్దుకున్న మావోయిస్టు విప్లవ పోరాటం ఇక్కడే ముగుస్తోందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలను గమనించి మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు. మంగళవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సహా నలుగురు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ సమక్షంలో దేవ్‌జీతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నలుగురు అగ్రనేతలు లొంగిపోవడం ద్వారా మావోయిస్టు పార్టీ అత్యున్నత సంస్థాగత నిర్మాణం పతనమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు లొంగిపోతున్న మావోయిస్టుల పునరావాసానికి కట్టుబడి ఉంటామని, వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడుతామని ప్రకటించారు. గతేడాది నుంచి నేటి వరకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 మంది జిల్లా కమిటీల సభ్యులు, 85 మంది ఏరియా కమిటీ సభ్యులతోపాటు 460 మంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలు కలిపి మొత్తం 591 మంది లొంగిపోయారని వెల్లడించారు. లొంగుబాటే కాకుండా తెలంగాణ ఎస్‌ఐబీ తీసుకున్న చర్యల వల్ల వీరు ఆయుధాలు కూడా అప్పగించారని, మొత్తం 142 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణం కుప్పకూలే దిశగా సాగుతుందన్న విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర కమిటీలో మరో ముగ్గురే..
మావోయిస్టులకు మద్దతిచ్చే వర్గాలు క్షీణించడం, క్యాడర్ల కదలికలపై పరిమితులు పెరగ డం, నిరంతర కూంబింగ్ చర్యలు, సిద్ధాంతపరమైన అసంతృప్తి నేపథ్యంలో.. మిగిలిన వారిలోనూ తీవ్రమైన అంతర్మథనం జరుగుతోందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఇంకా కేంద్ర కమిటీలో ముగ్గురు సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు, మిసిర్ బెహ్రా, నరహరి ఉన్నారని, వీరిలో లక్ష్మణరావు అడవుల్లో లేరని, ఆయన వృద్ధాప్య సమస్యలతో ఎక్కడో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం ఉందని తెలిపారు. లక్ష్మణరావు, ఆయన భార్య జోడేబాయి కూడా ముందుకొచ్చి లొంగిపోతే వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందినవారు ఇంకా 11 మంది వివిధ క్యాడర్లలో పలు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని, వారంతా కూడా త్వరగా వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. అగ్రనేతల లొంగుబాటు విషయంలో చొరవ చూపి మానవతా దృక్పథంతో చర్యలు తీసుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) ఐజీ సుమతి, ఆమె సిబ్బందిని డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండగా.. త్వరలో మావోయిస్టు పార్టీలోని వివిధ క్యాడర్లకు చెందిన 50 మందికి పైగా ఆయుధాలతో లొంగిపోనున్నట్లు సమాచారం.
44 ఏళ్లు అడవిలోనే.. చంద్రబాబుపై దాడి కేసులో కీలకం..
మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ అప్రకటిత కార్యదర్శిగా కొనసాగుతూ.. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్‌గా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద షాక్‌గా ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. 44 ఏళ్లు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగిన తిరుపతి.. మిలిటరీ వ్యూహకర్త మాత్రమే కాకుండా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అలిపిరిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో దేవ్‌జీ కీలకపాత్ర పోషించారు. దంతేవాడలో 2010లో జరిగిన 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్యలోనూ దేవ్‌జీ పాత్ర ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక మావోయిస్టు పార్టీలో 46 ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో పనిచేసిన కరీంనగర్ జిల్లా వాసి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడే కాకుండా.. పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ వార్ ద్వారా పార్టీలోకి వచ్చిన తర్వాత చర్చల సమయంలోనూ రాజిరెడ్డి కీలక పాత్ర వహించారు. ఒకటి రెండుసార్లు అరెస్టయినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అడవుల్లోకి వెళ్లి ఉద్యమంలో కొనసాగారు. పీపుల్స్‌వార్‌లో 2001లో ఏర్పాటు చేసిన సౌత్‌వె్‌స్ట రీజినల్ బ్యూరో ఇన్‌చార్జ్ గా ఆయన పనిచేశారు. 2004లో పీపుల్స్‌వార్, ఎంసీసీఐ విలీనమై సీపీఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాక పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు.
ఎస్‌ఐబీకి అభినందనల వెల్లువ..
నాటి పీపుల్స్‌వార్ పార్టీ నేతలను, కార్యక ర్తలను ట్రాకింగ్ చేసి ఆపరేషన్‌లో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు దిక్సూచిగా పనిచేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎ్‌సఐబీ) అటు పీపుల్స్‌వార్, తర్వాత మావోయిస్టుల కదలికలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించింది. మావోయిస్టు పార్టీని ముగింపు దశకు తీసుకురావడంలో ఎస్‌ఐబీ పాత్రను కేంద్ర ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపగా, పునరావాస ప్యాకేజీ, ప్రాణాలను కాపాడుతామని భరోసా ఇస్తూ ఎస్‌ఐబీ పావులు కదపడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు సైతం ఇక్కడికి వచ్చి లొంగిపోయారు. ఎస్‌ఐబీ ఏర్పడినప్పటి నుంచి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా 5,865 మంది మావోయిస్టులు లొంగిపోగా, 14,078 మావోయిస్టులను అరెస్టు చేశారు. 1289 మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. 1057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 మంది కేంద్ర కమిటీ సభ్యులను ట్రాకింగ్ చేస్తూ రంగంలో దిగిన తెలంగాణ ఎస్‌ఐబీ బృందం తీసుకున్న చర్యల వల్ల ఏడుగురు కేంద్ర కమిటీ సభ్యులు అరెస్టయ్యారు. మరో ఏడుగురు లొంగిపోయారు. పార్టీ సారథి బస్వరాజ్‌తోపాటు 9మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.
రూ.90 లక్షల రివార్డు..
లొంగిపోయిన నలుగురు మావోయిస్టు నేతలపై ఉన్న రివార్డు మొత్తాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి వారికి అందజేశారు. తిరుపతి, రాజిరెడ్డికి ఒక్కొక్కరిపై రూ.25 లక్షల చొప్పున ఉన్న రివార్డును, చొక్కారావు, నర్సింహారెడ్డిలపై రూ.20 లక్షల చొప్పున ఉన్న రివార్డును కలిపి మొత్తం రూ.90 లక్షలను వారికి అందజేశారు. వీరికి పునరావాస పథకం ద్వారా అందే ఇతరత్రా అన్ని ప్రయోజనాలనూ త్వరలో అందిస్తామని తెలిపారు.

పలుమార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకొని..
ములుగు జిల్లాకు చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 28 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో తెలంగాణలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 2019లో మావోయిస్టు పార్టీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జిగా దామోదర్‌ను తెలంగాణ కమిటీలో నియమించారు. ఆ తర్వాత గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ తెలంగాణలో జరిగిన పలు కీలక ఘటనల్లో ఆయన పాల్గొని పలుమార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. కాగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఒకటో బెటాలియన్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న, ఆంధ్రాకు చెందిన నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న గత ఏడాది నుంచి తెలంగాణ కమిటీలో పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ఆయన ప్రస్థానం 36 ఏళ్లు.

రాజకీయ జీవితం కొనసాగిస్తా: దేవ్‌జీ
అనారోగ్య సమస్యలతోనే తాము రహస్య జీవితాన్ని వదిలి వచ్చామని, వ్యక్తిగత జీవితం కోసం కాదని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. తాను రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని, నమ్మిన సిద్ధాంతాన్ని కాపాడుకుంటానని స్పష్టం చేశారు. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, అన్నీ త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

మావోయిజానికి ముగింపు లేదు: రాజిరెడ్డి
మావోయిజానికి ఎప్పుడూ ముగింపు ఉండదని, పోరాట పద్ధతుల తీరు మాత్రమే మారుతుందని మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తున్నవారిని సంఘటితం చేసుకుంటూ తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేస్తామని, అయితే పార్లమెంటరీ వ్యవస్థ వైపు తాను వెళ్లనని స్పష్టం చేశారు. తమ ఆలోచనల విస్తృత రూపాన్ని త్వరలో ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు.
నేపాల్‌లో గణపతి.. తెలంగాణ పోలీసుల అదుపులోకి!
మావోయిస్టు పార్టీ ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితోపాటు ఆయన భార్య జోడే రత్నాబాయి అలియాస్ సుజాతను నేపాల్‌లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వీరిద్దరిని సైతం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతూ న డవలేని స్థితిలో ఉన్న గణపతికి అడవుల్లో షెల్టర్ ఇవ్వడం ప్రయాసగా మారడంతో ఆయనను పార్టీ నాయకత్వం రెండేళ్ల క్రితం నేపాల్‌కు తరలించినట్లు తెలుస్తోంది. దేవ్‌జీ లొంగుబాటుకు వచ్చిన తర్వాత గణపతికి సంబంధించిన కీలక సమాచారం పోలీసులు ధ్రువీకరించుకుని ఆయన లొకేషన్‌ను గుర్తించినట్లు సమాచారం.

కొడుకు ఇంటికి రావాలని వనదేవతలకు మొక్కిన: బడే బతుకమ్మ
తాడ్వాయి/కోరుట్ల: ప్రజల కోసం అడవిబాట పట్టిన తన కొడుకు ఇంటికి క్షేమంగా రావాలని వనదేవతలు సమ్మక్క- సారలమ్మలను మొక్కుకున్నానని మావోయిస్టు నేత బడే చొక్కారావు తల్లి బడే బతుకమ్మ అన్నారు. చొక్కారావు పోలీసులకు లొంగిపోయారనే సమాచారం తెలియగానే సంతోషించానని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. 30 ఏళ్ల క్రితం దూరమైన కన్న కొడుకును చూడబోతున్నానని బతుకమ్మ ఆనంద భాష్పాలు రాల్చారు. పలువురు గ్రామస్తులు బతుకమ్మ ఇంటి వద్దకు వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగుబాటుతో ఆయన కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మా నిరీక్షణ నెరవేరింది.. జనజీవన స్రవంతి నిన్ను స్వాగతిస్తోంది పెద నాన్నా’’ అంటూ తిరుపతి తమ్ముడి కూతురు సుమ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
ఆ 11మంది వీరే..!
మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందినవారు ఇంకా 11 మంది ఉన్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పినవారిలో కేంద్ర కమిటీ సభ్యుడైన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తీవ్రమైన అనారోగ్యంతో నేపాల్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడైన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఈస్ట్ రీజినల్ బ్యూరోలో పనిచేస్తూ ఝార్కండ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఒడిసా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జిగా ఉన్న వార్త శేఖర్ అలియాస్ మంగ్తూ, కేంద్ర కమిటీ సభ్యురాలైన ముప్పాళ్ల లక్ష్మణరావు భార్య జోడేబాయి అలియాస్ సుజాత మాడ్ డివిజన్ ఇన్‌చార్జిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నప్పటికీ ఆమె గణపతితోనే ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ విద్యాకమిటీలో పనిచేస్తున్న నక్కా సుశీల, సాంకే తిక విభాగంలో పనిచేస్తున్న జాడి పుష్ప, ఏరియా కమిటీ సభ్యురాలైన రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ, కాశపోగు భవాని, కుంజం ఇడ్మాల్, అనిల్‌కుమార్‌లు ఇంకా అడవుల్లో రహస్య జీవితం గడుపుతున్నారని పోలీసులు తెలిపారు.