మరికాసేపట్లో ఎన్నికల ప్రచారానికి తెర
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:42 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరికాసేపట్లో తెరపడనుంది. నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో.. వివిధ పార్టీల నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 09: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:00 గంటకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. బుధవారం అంటే.. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు పోలింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, అగ్రనేతలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలతో హోరెత్తిపోతోంది.
సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో.. మైకులు మూగబోతున్నాయి. అగ్రనేతలతో పాటు కేడర్ అంతా ఇంటి బాటపడుతోంది. ఆఖరి రోజు ప్రచారంలో పాల్గొన్న నేతలు.. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. మరో వైపు 11వ తేదీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13న(శుక్రవారం) వెలువడనున్నాయి.