మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ.. రైతులకు అండగా నిలవాలని పిలుపు..
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:29 PM
తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఎల్-నినో సమయంలో రైతులకు అండగా నిలవాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు తుమ్మల పిలుపునిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఎల్-నినో సమయంలో రైతులకు అండగా నిలవాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు తుమ్మల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్-నినో సవాళ్లకు డ్రిప్, తుంపర సేద్యమే పరిష్కార మార్గమని ఆయన పేర్కొన్నారు. డ్రిప్ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆ కంపెనీలకు మంత్రి సూచించారు. పెండింగ్‌లో ఉన్న డ్రిప్ పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బీఎంఎస్, బీఓక్యూలను పూర్తి చేసి వెంటనే అనుమతుల కోసం పంపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పరిపాలనా అనుమతుల్లో జాప్యానికి తావివ్వొద్దని మంత్రి తుమ్మల సూచించారు.
డ్రిప్ వ్యవసాయ పద్ధతిలో తక్కువ నీరు, విద్యుత్ ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పంటల వైవిధ్యీకరణకు మైక్రో ఇరిగేషన్ కీలకమని అన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు డ్రిప్ సదుపాయాలను వెంటనే కల్పించాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు హుకుం జారీ చేశారు. అవగాహన కార్యక్రమాల్లో ఆయా కంపెనీలు తప్పనిసరిగా పాల్గొనాలని, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.400 కోట్లు చెల్లించిందని ఈ సందర్భంగా వెల్లడించారు. కంపెనీల పనితీరుపై జిల్లాల వారీగా నిరంతర సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. సూక్ష్మ సాగునీటి విస్తరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిట్‌కు ఎదురుగా అకడమిక్ బ్లాక్
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..