మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీకి ఆదరణ
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:08 AM
ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజల ఇంటి వద్దకే ేసవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన
నెల రోజుల్లోనే 3,885 కాల్స్
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలూ ఇంటి వద్దకే..
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజల ఇంటి వద్దకే సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ సేవలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సేవలు ప్రారంభమైన తొలి నెలలోనే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు 3,885 కాల్స్ వచ్చాయని సంబంధిత అధికారులు వె ల్లడించారు. ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ నమోదు, ఆధార్ వివరాల నవీకరణ వంటి సేవలను ఇంటివద్దే పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
ఇందులో భాగంగా ప్రజలు మీ సేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండానే తమకు అవసరమైన సేవలను పొందేలా డోర్‌స్టెప్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ డోర్‌స్టెప్ సేవలు క్యూర్ పరిధిలోని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సేవలను బుక్ చేసుకునే సమయంలో వర్తించే రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
సేవలను ఇలా పొందొచ్చు..
డోర్‌స్టెప్ సేవలు పొందాలనుకునేవారు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. లేదా మీ సేవా పౌరుల పోర్టల్‌లో అభ్యర్థన నమోదు చేయాలి. అనంతరం కావాల్సిన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ సేవను ఎంపిక చేసుకుని, అవసరమైన వివరాలను అందించాలి. నిర్ణయించిన సమయంలో మీ సేవా ప్రతినిధి ఇంటికి వచ్చి సేవలను అందిస్తారు. తొలి నెలలోనే వేల సంఖ్యలో కాల్స్ రావడంతో ఈ విధానంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు
Read Latest Telangana News And Telugu News