రాయి పోయినా.. హద్దు చెరగదు!
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:55 AM
పక్క రైతు హద్దు రాయిని రాత్రికి రాత్రి జరిపేశాడు.. గట్టు కొద్దికొద్దిగా లోపలికి వచ్చింది.. సర్వేయర్ గొలుసుతో కొలిస్తే ఒకసారి ఒకలా, మరోసారి మరోలా వచ్చింది..
రీ సర్వేలో సరికొత్త ‘కోర్స్’ సాంకేతికత వినియోగం..
సెంటీమీటర్ల తేడాతోనే భూమి హద్దుల గుర్తింపు
ఫోన్ జీపీఎస్‌లో మీటర్ల తేడా..
కోర్స్‌తో 2-4 సెంటీమీటర్లే
ఒకసారి నమోదైతే రాళ్లు తీసేసినా హద్దు మళ్లీ గుర్తింపు
హద్దు తేలుస్తుంది కానీ హక్కు కాదు..
రైతులు అప్రమత్తంగా ఉండాల్సిందే
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పక్క రైతు హద్దు రాయిని రాత్రికి రాత్రి జరిపేశాడు.. గట్టు కొద్దికొద్దిగా లోపలికి వచ్చింది.. సర్వేయర్ గొలుసుతో కొలిస్తే ఒకసారి ఒకలా, మరోసారి మరోలా వచ్చింది.. పల్లెల్లో భూ తగాదాలు ఎక్కువగా ఇక్కడి నుంచే మొదలవుతాయి. రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేలో ఈ సమస్యకు పరిష్కారంగా అధికారులు చెబుతున్న సాంకేతికతల్లో ఒకటి ‘కోర్స్’ (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్). సాధారణ జీపీఎస్‌తో కొలిస్తే భూమి స్థానం కొన్ని మీటర్ల వరకు అటూ ఇటూ రావచ్చు. రెండు మీటర్లు తేడా వచ్చినా గట్టు పక్క రైతు పొలంలోకి వెళ్లిపోతుంది. కోర్స్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ‘రోవర్’ పరికరంతో కొలిస్తే అనుకూల పరిస్థితుల్లో ఈ తేడా కొన్ని సెంటీమీటర్లకే పరిమితమవుతుందని సర్వే అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఈ పద్ధతిలో హద్దులు నమోదైతే.. హద్దు రాళ్లుతీసేసినా, గట్లు చెరిపేసినా ఆ కొలతల ఆధారంగా అసలు హద్దును మళ్లీ అదే చోట గుర్తించవచ్చు.
కోర్స్ అంటే ఏంటి?
మన ఫోన్‌లోని జీపీఎస్ ఆకాశంలోని ఉపగ్రహాల నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా మనం ఎక్కడున్నామో చెబుతుంది. కానీ ఆ సంకేతాలు భూమిని చేరే దారిలో వాతావరణం వల్ల, ఉపగ్రహాల గడియారాల్లోని చిన్న తేడాల వల్ల కొంత పొరపాటు చోటు చేసుకుంటుంది. అందుకే ఫోన్ చూపే స్థానం కొన్ని మీటర్లు అటూ ఇటూ ఉంటుంది. ఈ పొరపాటును సరి చేయడానికే కోర్స్ స్టేషన్లు. ఇవి ఎంపిక చేసిన చోట్ల శాశ్వతంగా ఏర్పాటు చేసే స్థిరమైన కేంద్రాలు. ప్రతి కేంద్రం సరిగ్గా ఎక్కడ ఉందో ముందుగానే అత్యంత కచ్చితంగా లెక్కగట్టి పెడతారు. ఈ కేంద్రాలు రోజంతా, ఏడాది పొడవునా ఉపగ్రహ సంకేతాలను అందుకుంటూనే ఉంటాయి. తమ అసలు స్థానం తెలుసు కాబట్టి.. ఉపగ్రహ సంకేతం ఎంత పొరపాటు చూపుతోందో వెంటనే గుర్తిస్తాయి. ఆ సవరణను ఇంటర్నెట్ ద్వారా పొలంలో ఉన్న సర్వేయర్ చేతిలోని రోవర్‌కు పంపుతాయి. రోవర్ ఆ సవరణను కలుపుకొని తన స్థానాన్ని సెంటీమీటర్ల కచ్చితత్వంతో లెక్కిస్తుంది. చుట్టుపక్కల ఉన్న అనేక కేంద్రాల సమాచారాన్ని కలిపి వాడటంవల్ల కచ్చితత్వం మరింత పెరుగుతుంది. అంటే కోర్స్ అనేది కొలిచే పరికరం కాదు.. పరికరానికి సరైన దారిచూపే వ్యవస్థ.
దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేంద్రాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 1,145 కోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి జాతీయ నెట్‌వర్క్‌ను నడుపుతోంది. ఈ సేవతో కొద్ది నిమిషాల్లోనే 2-3 సెంటీమీటర్ల కచ్చితత్వంతో స్థానాన్ని గుర్తించవచ్చని సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. గతంలో ఇంతటి కచ్చితత్వం కోసం పొలంలో కనీసం రెండు గంటలు పరికరం పెట్టి కొలతలు తీసుకుని, తర్వాత కార్యాలయంలో లెక్కలు వేయాల్సి వచ్చేది. తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ భూ సర్వే కోసం సొంతంగా 70 కోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. కోర్స్ ద్వారా 3-4 సెంటీమీటర్ల కచ్చితత్వం సాధ్యమని తెలంగాణ సర్వే విభాగం అధికారులు చెబుతున్నారు.
పొలంలో కొలత ఇలా..
సర్వేయర్ రోవర్‌ను పొలంలోకి తీసుకెళ్లి కోర్స్ నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు. రోవర్ కచ్చితమైన స్థానాన్ని లెక్కించిందని నిర్ధారించుకున్నాక భూమి ప్రతి మూల వద్ద, హద్దు మలుపు వద్ద రోవర్‌ను నిలబెట్టి కొలతలు తీసుకుంటారు. ప్రతి పాయింట్ అక్షాంశం, రేఖాంశం, ఎత్తు వివరాలు నేరుగా డిజిటల్ రూపంలో నమోదవుతాయి. ఈ పాయింట్లను కలిపి ఆ భూమి కచ్చితమైన డిజిటల్ పటాన్ని తయారు చేస్తారు. రీ సర్వే పూర్తయ్యాక భతికంగా హద్దు రాళ్లు పాతాల్సిన అవసరం ఉండదని, అనుమానం వస్తే రైతులు తమ ఫోన్‌లోనే భూమి హద్దులు చూసుకోవచ్చని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ ఇటీవల వెల్లడించారు.
తొలి దశలో 2,720 గ్రామాలు
నిజాం కాలంలో 1930వ దశకంలో జరిగిన సర్వే తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ భూముల సమగ్ర సర్వే జరగలేదు. 1948లో 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్లు భూముల పంపకాలతో ఇప్పుడు 2.29 కోట్లకు చేరాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వెల్లడించారు. రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశలో 2,720 గ్రామాల్లో రీ సర్వే చేపట్టారు. ఈ నెల 11 నాటికి వెయ్యి గ్రామాల్లో సర్వే మొదలుకాగా 416 గ్రామాల్లో పూర్తయిందని, ఇందుకోసం 411 రోవర్లు కొనుగోలు చేశామని, మరో 400 కొనబోతున్నామని మంత్రి జూన్‌లోనే ప్రకటించారు. రీ సర్వే పూర్తయ్యాక ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులతో పాటు ప్రత్యేకమైన ’భూధార్’ నంబరు ఇస్తారు. సర్వే తర్వాత భూ యజమానులకు నోటీసులిచ్చి, నిర్ణీత గడువులో వివరాలు సరిచూసుకుని అభ్యంతరాలు చెప్పే అవకాశం కల్పిస్తారు.
హద్దు తేలినా.. హక్కు తేలదు
సెంటీమీటర్ల కచ్చితత్వంతో కొలిచే సాంకేతికత వచ్చినా భూ వివాదాలన్నీ సమసిపోవని అధికారులే చెబుతున్నారు. భూమి ఎక్కడ ఉందో కోర్స్ చెబుతుంది. కానీ ఆ భూమి ఎవరిదో చెప్పదు. ఆ హక్కును రికార్డులు, చట్టం ఆధారంగా తేల్చాల్సింది రెవెన్యూ యంత్రాంగమే. పాత సర్వేలో, పాత రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయకుండా కొత్త పరికరాలతో యథాతథంగా డిజిటల్ రూపంలోకి ఎక్కిస్తే సమస్య తీరకపోగా.. అవే తప్పులు శాశ్వత డిజిటల్ రికార్డులుగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే సర్వే జరిగే రోజు రైతులు తమ పొలం వద్ద స్వయంగా ఉండి హద్దులు చూపించడం, తర్వాత వచ్చే నోటీసులోని కొలతలను తమ పాత పత్రాలతో పోల్చి చూసుకోవడం, తేడా ఉంటే గడువులోగా అభ్యంతరం చెప్పడం ముఖ్యం.
అడ్డంకులున్న చోట తేడాలు
కోర్స్ పనిచేయాలంటే రోవర్‌కు ఉపగ్రహ సంకేతాలు సరిగా అందాలి, ఇంటర్నెట్ కూడా ఉండాలి. దట్టమైన చెట్లు, పొదలు ఉన్న చోట్ల, సిగ్నల్ సరిగా లేని ప్రాంతాల్లో కచ్చితత్వం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్నెట్ వసతి లేని మారుమూల గ్రామాల్లో కోర్స్ ఇచ్చే వివరాల్లో లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అలాంటి చోట్ల కొలతలను మరోసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక