కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత..
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:04 PM
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో పేదలను రేవంత్ రెడ్డి సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రేషన్ కార్డుల ఏరివేత అనే దుర్మార్గపు చర్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహించారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో కార్డులు తీసేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఉపయోగపడే రేషన్ కార్డుల విషయంలో ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవుపలికారు.
కొండగట్టు చలువ పందిళ్ల ప్రమాదంపైనా కవిత స్పందించారు. పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ చిన్న జయంతి వేడుకల కోసం నాసిరకం పందిళ్లు వేయడంతోనే ప్రమాదం జరిగిందని కవిత ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కవిత.
ఈ వార్తలు కూడా చదవండి
వికారాబాద్‌లో దారుణం... మహిళ హత్య
ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..