మూసాపేట్ ట్రక్ పార్కింగ్ స్థలం కేసులో ప్రభుత్వానికి ఊరట
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:32 AM
మూసాపేట్ ట్రక్ పార్కింగ్ స్థలం వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మూసాపేట్ ట్రక్ పార్కింగ్ స్థలం వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ స్థలం బహిరంగ వేలం కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తుది తీర్పు ఇచ్చింది. మల్కాజ్‌గిరి జిల్లా మూసాపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121/పీ నుంచి 157 వరకు పలు సర్వేనెంబర్లలో ఉన్న 3.15 ఎకరాల హుడా ట్రక్ పార్కింగ్ స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టిందని.. ఆ వేలాన్ని అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ నేత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ నేత మాధవరం కాంతారావు వేర్వేరుగా పిల్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శాంకోషీ, జస్టిస్ చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రజల అవసరాల కోసం సేకరించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అమ్మడం చెల్లదన్నారు. కాగా, ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆ స్థలాన్ని ట్రక్ పార్కింగ్‌కు ఎన్నడూ కేటాయించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టేస్తూ తుది తీర్పును వెలువరించింది. మరోవైపు, మూసాపేట్ ట్రక్ పార్కింగ్ స్థలం వేలాన్ని అడ్డుకోవాలని కోరుతూ హుడా మెట్రో పార్కింగ్ లోకల్ లారీ అండ్ డీసీఎం ఓనర్ల సంఘం, డ్రైవర్ల సంఘం, విఘ్నపురి వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్స్‌ను డివిజన్ బెంచ్ కొట్టేసిందని ఇరుపక్షాల న్యాయవాదులు చెప్పటంతో, విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.