Share News

మూసాపేట్‌ భూమి ట్రక్‌ పార్కింగ్‌ కాదు

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:30 AM

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేట్‌లో భారీ సరుకు రవాణా వాహనాలు నిలుపుతున్న స్థలాన్ని ఎప్పుడూ పార్కింగ్‌ కోసం కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

మూసాపేట్‌ భూమి ట్రక్‌ పార్కింగ్‌ కాదు
TG HIgh Court

  • దానిని ఎప్పుడూ పార్కింగ్‌ కోసం కేటాయించలేదు.. నగరం మధ్యలో ట్రక్‌ పార్కింగ్‌ ఉండటం ప్రమాదకరం

  • ప్రజావసరాల కోసమే భూమిని వేలం వేస్తున్నాం

  • హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ

  • రియల్‌ ఎస్టేట్‌ కోసమే దానిని విక్రయానికి పెట్టారు

  • ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,

  • బీజే పీ నేత మాధవరం కాంతారావు వాదన

  • తీర్పును రిజర్వ్‌ చేసిన కోర్టు..

  • నేడు వేలం కొనసాగే అవకాశం

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేట్‌లో భారీ సరుకు రవాణా వాహనాలు నిలుపుతున్న స్థలాన్ని ఎప్పుడూ పార్కింగ్‌ కోసం కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నగరం మధ్యలో భారీ వాహనాలు నిలపటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ప్రజా అవసరాల కోసం నిధులు సేకరించటానికే ఆ స్థలాన్ని వేలం వేయాలని నిర్ణయించినట్లు వివరించింది. మూసాపేట్‌ ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ నేత మాధవరం కాంతారావులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలు చేశారు. వీటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌కోషి, జస్టిస్‌ చలపతిరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. మూసాపేట్‌ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 121/పీ నుంచి 157 వరకు ఉన్న హుడా ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. విస్తృత ప్రజా అవసరాల కోసం వినియోగిస్తున్న ఆ భూమిని ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం శుక్రవారం వేలం వేస్తోందని ఆరోపించారు. నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ - ముంబై జాతీయ రహదారిపై ట్రక్కుల పార్కింగ్‌ కోసం ఆ భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించిందని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూమిని రియల్‌ ఎస్టేట్‌ కోసం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు కట్టుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించటం చట్ట విరుద్ధమని వాదించారు.


ప్రజా అవసరాల కోసమే విక్రయం: ప్రభుత్వం

పిటిషనర్ల వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్లలో ఒకరు ఆ ప్రాంత ఎమ్మెల్యే, మరొకరు అక్కడ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ఉంది కాబట్టి వారు దాఖలు చేసిన పిల్స్‌ ప్రజా ప్రయోజనాల కిందికి రావు. అవి రాజకీయ దురుద్దేశం, వేలాన్ని అడ్డుకొని తీరాలన్న ఉద్దేశంతో దాఖలు చేసినవి. నాలుగు దశాబ్దాల క్రితం ఆ స్థలాన్ని భూసేకరణ చట్టం కింద సేకరించినప్పటికీ ఎప్పుడూ దానిని పార్కింగ్‌ కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. అక్కడ వాహనాలు నిలపరాదని 2005లోనే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఒకప్పుడు ఆ ప్రాంతం హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఉండేది. భారీ వాహనాల పార్కింగ్‌ కోసం అప్పుడు తాత్కాలికంగా వాడుకున్నారు. ఇప్పుడు అది నగరం నడిబొడ్డుకు చేరింది. అక్కడ ట్రక్‌ పార్కింగ్‌ ఉండటం స్థానికులకు చాలా ప్రమాదకరం. ఆ స్థలం విక్రయం ద్వారా వచ్చే నిధులను రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే వినియోగిస్తాం’ అని వివరించారు. ఈ సందర్భంగా.. ‘నగరం మధ్యలో ట్రక్‌ పార్కింగ్‌ ఉండటం వల్ల కాలుష్యం పెరుగుతుంది కదా? ప్రస్తుతం అమ్మకానికి పెట్టిన 3.5 ఎకరాలు కాకుండా ఇంకా అక్కడ సగం స్థలం ఉన్నప్పుడు.. లారీ ఓనర్ల సంఘానికి లేని అభ్యంతరం మీకు ఎందుకు?’ అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో లారీ ఓనర్ల సంఘం కూడా హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ దాఖలు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. కాగా కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవటంతో నేడు (శుక్రవారం) ఆ స్థలాన్ని ప్రభుత్వం యథావిధిగా వేలం వేసే అవకాశం ఉంది. శుక్రవారం కేసుల విచారణ జాబితాలో సైతం ఈ పిటిషన్లు లిస్ట్‌ కాలేదు

Updated Date - Nov 27 , 2026 | 01:30 AM