అడవి బిడ్డలకు అన్యాయం
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:23 AM
అడవి బిడ్డలకు ఉపాధి, ఆదాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అది. గిరిజనుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం పని చేసే సంస్థ. అలాంటి గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే కాకుండా....
అధికారుల స్వార్థంతో కుప్పకూలుతున్న జీసీసీ
20శాతం లాభాలు కాదని.. 1 శాతం కమీషన్‌కు సిద్ధపడ్డ వైనం
గిరిజన ఉత్పత్తుల సరఫరా బాధ్యత ఏపీలోని ప్రైవేటు కంపెనీకి
దశాబ్దాల నాటి సొంత ప్రాసెసింగ్ యూనిట్లకు తాళాలు
ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ గిరిజన మహిళలు
‘గిరి’ బ్రాండ్ పేరిట నాసిరకం ఉత్పత్తుల సరఫరా
ప్రైవేటు కంపెనీ యజమాని.. ఏపీ మాజీ మంత్రి బంధువు!
ఇద్దరు ఐఏఎస్‌లకు భారీ లంచాలు.. అనుకూలంగా ఉత్తర్వు
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అడవి బిడ్డలకు ఉపాధి, ఆదాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అది. గిరిజనుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం పని చేసే సంస్థ. అలాంటి గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే కాకుండా....ఆ సంస్థ మీద ఆధారపడిన అనేకమంది గిరిజన మహిళల నోట్లో మట్టి కొట్టే అక్రమానికి కొందరు ఉన్నతాధికారులు తెరతీశారు. తమ స్వార్థం కోసం జీసీసీని కుప్పకూల్చే కుట్రలను అమలు పరిచారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు గిరిజన ఉత్పత్తులను సరఫరా చేసే బాధ్యతల నుంచి జీసీసీని తప్పించి, రాష్ట్రంలో ఎలాంటి తయారీ యూనిట్లు లేని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు టెండర్లు లేకుండానే నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టు కట్టబెట్టారు.
మసాల దినుసులు, కారం, పసుపు, సాంబార్ పొడి, పల్లీపట్టీ, మిల్లెట్ చిక్కీ తదితర ఉత్పత్తుల సరఫరా బాధ్యతలను అప్పగించారు. ఆ ఉత్పత్తులను సదరు ప్రైవేటు సంస్థ జీసీసీకి చెందిన ‘గిరి’ బ్రాండ్‌పైనే సరఫరా చేయాలని, ఆ బ్రాండ్‌ను వాడుకున్నందుకు జీసీసీకి ఒక శాతం రాయల్టీ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో జీసీసీ కింద ఏర్పాటైన పరిశ్రమలు మూతపడటమేగాక వాటిల్లో పని చేసే గిరిజన మహిళలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. ఓ ఐఏఎస్ అధికారి, ఆయనకు మరో అధికారి తోడై గిరిజనుల నోట్లో మట్టి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన రైతుల నుంచి అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి, గిరిజన మహిళలతో ప్రాసెసింగ్ చేయించి, గిరి బ్రాండ్ పేరుతో విక్రయించాల్సిన జీసీసీ.. వ్యాపారుల ప్రయోజనాలకు వేదికగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గిరిజనులకు ఉపాధి.. విద్యార్థులకు పౌష్టికాహారం
గిరిజనులు సేకరించే తేనె, ఇప్పపువ్వు, తునికాకు తదితర అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు తొలిరోజుల్లో పరిమితమైన జీసీసీ.. తర్వాత కాలంలో కార్యకలాపాలను విస్తరించింది. జీసీసీ ఆధ్వర్యంలో నిర్మల్, ఉట్నూర్, భద్రాచలం, ఇల్లందు, ఏటూర్‌నాగారం తదితర ప్రాంతాల్లో కారం, పసుపు, మసాలా, సాంబార్ పొడి, తేనె, పల్లీ పట్ట్టీ, మిల్లెట్ చిక్కీలతో పాటు సబ్బులు, డిటర్జంట్లు, షాంపూల తయారీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటిలో తయారయ్యే ఉత్పత్తులను గిరి బ్రాండ్ పేరిట గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు సరఫరా చేయగా మిగిలిన వాటిని మార్కెటింగ్ చేసేవారు. మరోవైపు, గిరిజన మహిళా సమాఖ్యలను కూడా ఏర్పాటు చేశారు.
వాటికి ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసి ఆహార ఉత్పత్తులను తయారు చేయించి, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. గిరి ఉత్పత్తుల ఫార్ములేషన్, నాణ్యతా ప్రమాణాలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) నిర్ధారించేలా ఒప్పందం కుదిరింది. ఈ ఉత్పత్తుల తయారీ, విక్రయంతో గిరిజనులకు ఉపాధి, ఆర్థిక ఆసరా లభించటంతోపాటు హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం లభిస్తోంది.
జీసీసీలకు ఏటా 15-20 శాతం లాభంతో, రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ఇకపై తెలంగాణ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో తయారయ్యే గిరి ఉత్పత్తులనే తప్పనిసరిగా వినియోగించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగయ్యాయి. కానీ, కొందరు అధికారులు తమ స్వార్థం కోసం ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించటానికి కుట్రలు రచించారు.
కొందరి స్వార్థంతో కుప్పకూలుతున్న వ్యవస్థ
ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ టెండర్ల విధానం నుంచి తప్పించుకునేలా వీరు థర్డ్ పార్టీ ఫ్రాంచైజీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. గిరి బ్రాండ్లను తెరమీదకు తీసుకొచ్చి.. వాటిని సెంట్రలైజ్డ్ టెండర్స్‌లో మినహాయించేలా ప్రయత్నించారు. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లకు గిరి ఉత్పత్తుల సరఫరా బాధ్యతల నుంచి జీసీసీ తప్పుకొనేలా చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ కంపెనీకి తెలంగాణలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా లేకపోవటం గమనార్హం. ఎలాంటి టెండర్లు లేకుండా ఆ కంపెనీకి అవకాశం ఇచ్చి, థర్డ్ పార్టీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఉత్పత్తుల అమ్మకాల మీద వచ్చే ఆదాయంలో ఒక శాతం కమిషన్‌ను జీసీసికి ఇవ్వాలన్నది ఒప్పందం.
స్వయంగా ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తే జీసీసీకి 15-20 శాతం లాభాలు వస్తుంటే.. దానిని మానుకొని ఒక్క శాతానికి సిద్ధపడటం ఏమిటి? ఇది జీసీసీని నిండా ముంచటమే కదా! అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, గిరి బ్రాండ్ పేరుతో ఆ ప్రైవేటు సంస్థ ఇష్టమొచ్చిన ధరలు వేసుకుంటుంది. ఎమ్మార్పీ కంటే 8-10శాతం తక్కువకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా.. అసలు ఎమ్మార్పీని కూడా సదరు కంపెనీయే ముద్రించుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఉత్పత్తుల నాణ్యత మాటను గాలికి వదిలేశారు. గిరిజన మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ఏకంగా ఐఐఎంఆర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ పరీక్షించి వాటి నాణ్యతను ధ్రువీకరిస్తుంటే.. ఈ ప్రైవేటు కంపెనీకి అటువంటి ‘జంజాటం’ కూడా లేకుండా అధికారులు మినహాయింపు ఇచ్చారు.
సదరు కంపెనీ గుంటూరు, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లలో మిర్చిని, నిజామాబాద్ నుంచి పసుపును తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ నాసిరకం సరుకును గిరి బ్రాండ్ పేరుతో సరఫరా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంతంగా సబ్బులు, డిటర్జెంట్లు, శాంపుల తయారీ పరిశ్రమలు జీసీసీలకు ఉన్నా.. వాటి సరఫరా బాధ్యతలు కూడా మరో ప్రైవేట్ కంపెనీకి అధికారులు కట్టబెట్టారు. ఇలా నిబంధనలను తుంగలో తొక్కి, ఏకపక్షంగా ప్రైవేట్ శక్తులకు సరఫరా బాధ్యతలు కట్టబెట్టడంతో గిరిజన స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలు తీర్చలేక రోడ్డున పడ్డారు. ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆర్డర్లు లేకపోవడంతో జీసీసీ ఆధ్వర్యంలోని ప్రాసెసింగ్ యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన యంత్రాలు నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది.
దందా వెనుక ఏపీ మాజీ మంత్రి బంధువు
ఏపీకి చెందిన సదరు ప్రైవేట్ కంపెనీ యజమాని.. తనను తాను వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన ఓ నాయకుడి బంధువునని ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. విజయ కంపెనీకి చెందిన వంటనూనె సరఫరాలోనూ ఇదే తరహా ఫ్రాంచైజీ నమూనాతో.. కోట్లు దండుకున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ భారీగా డబ్బులు తీసుకొని అతడికి సహకరించినట్లు తెలిసింది. ఇప్పుడు జీసీసీ విషయంలోనూ ఆ రిటైర్డ్ ఐఏఎస్ ద్వారా మరో ఐఏఎ్‌సకు పెద్ద ఎత్తున లంచం డబ్బులు అందించి, తన కంపెనీకి అనుకూలంగా జీవోలు వచ్చేలా చూసుకున్నాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News