ఎల్-నినో ఎఫెక్ట్.. రాష్ట్రస్థాయి కంటింజెన్సీ ప్లాన్-2026 సిద్ధం..
ABN , Publish Date - Jul 16 , 2026 | 09:49 PM
ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యల కోసం రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్-2026ను సిద్ధం చేసింది.
హైదరాబాద్: ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యల కోసం రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్-2026ను సిద్ధం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్లాన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని మూడు వ్యవసాయ జోన్లుగా విభజించినట్లు తుమ్మల తెలిపారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, వర్షపాతం అంచనాలకు అనుగుణంగా శాస్త్రీయ సాగు మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ప్రణాళికలో రాష్ట్రంలోని 18 ప్రధాన పంటలకు సంబంధించి సాగు విధానాలు, విత్తనాల ఎంపిక, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర సూచనలు పొందుపరిచినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లా, మండలాల వారీగా వర్షపాతం అంచనాలనూ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు నష్టపోకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే భూగర్భ జలాలు, ప్రాజెక్టుల నీటి లభ్యతపైనా సమగ్ర సమాచారం అందులో పేర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నీటి వివరాలను రోజువారీగా రైతులకు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్‌వెల్స్ ఆధారంగా వరి సాగు చేయవద్దని సూచించారు. అలాగే నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలు, ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి తుమ్మల కోరారు.
గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు శాస్త్రీయ సలహాలు అందించేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఎల్-నినో ప్రభావంతో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ సాగు విధానాల కంటే పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి నిర్వహణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్: డీజీపీ సీవీ ఆనంద్
టీజీ-20 విజేతలతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణకు మంచి పేరు తేవాలని సూచన..