ఎల్‌నినోపై అఖిలపక్ష భేటీ.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 09:23 PM
ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తం కుమార్, సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి, వాకిటి శ్రీహరి సహా అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎల్ రమణ, వినోద్ కుమార్, ఎమ్ఐఎమ్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఎమ్ నుంచి జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులందరూ చర్చించారు.
సమావేశానికి సీఎం రాకపోవడం కరెక్ట్ కాదు.. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోవడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం వచ్చి వివరణ ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అసమర్థత వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఎల్‌నినోపై రేవంత్ సర్కార్‌కు ముందు చూపు లేదని విమర్శించారు. కృష్ణా గోదావరి నీళ్లను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని అన్నారు. ‘కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. భరోసా ఇవ్వాల్సిన సర్కార్ భయాందోళనలకు గురి చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
తూతూ మంత్రంగా అఖిలపక్ష సమావేశం.. బీఆర్ఎస్ నేత ఎల్ రమణ
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఎల్. రమణ మాట్లాడుతూ.. తూతూ మంత్రంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారని విమర్శించారు. ప్రభుత్వంపైన ఆయన మండిపడ్డారు. నీటిని ఒడిసి పట్టుకోకపోవడం వల్ల నీళ్లు వృథాగా పోయాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సానుకూల చర్యలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
కరోనా కరువు కంటే ఎలినినో ప్రమాదకరం.. మాజీ ఎంపీ బోయిన పల్లి వినోద్ కుమార్
కరోనా కరువు కంటే ఎలినినో కరువు ప్రమాదకరమైందని మాజీ ఎంపీ బోయిన పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ కష్టకాలంలో 750టీఎంసీల కంటే ఎక్కువ గోదావరి జలాలు ఏపీకి పోయాయని చెప్పారు. 250టీఎంసీల కృష్ణా జలాలు కుప్పానికి పోయాయన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సీతక్క