పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Jul 06 , 2026 | 02:51 PM
తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం క్యాంపస్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCRHRD) క్యాంపస్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై వారికి కీలక సూచనలు చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి. గొల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని టూరిజం ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మంజీరా, దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునికీకరించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్‌లోని వీరభద్రస్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో భాగ్యనగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని ఆజ్ఞాపించారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని, ఆ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక అధికారిని నియమించి పనులను ముమ్మరం చేయాలన్నారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అవకాశం ఉంటే ట్రాఫిక్‌ను మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పైనా కసరత్తు ప్రారంభించాలని, సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఈ సమీక్షా సమావేశానికి సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ
రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరు వాడుకున్నారు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం