40 శాతం పేదలు 4 కులాల్లోనే..
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:42 AM
తెలంగాణలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్ నివేదిక బహిర్గతం చేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ పరంగా వివిధ సామాజికవర్గాల ....
మాదిగ, లంబాడా, ముదిరాజ్, యాదవుల్లో ఎక్కువ పేదరికం
రాష్ట్రంలో లక్షలోపు వార్షికాదాయం ఉన్న జనాభా 1.1 కోట్లు
వీరిలో 31 శాతం ఆ నాలుగు కులాల్లోనే..
కులాల మధ్య అవకాశాలు, ఆదాయం, విద్య, ఉద్యోగాల్లో భారీ వ్యత్యాసం
సీపెక్ సర్వేలో వెలుగులోకి..
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్ నివేదిక బహిర్గతం చేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ పరంగా వివిధ సామాజికవర్గాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిరుపేదల్లో దాదాపు 40 శాతం నాలుగు కులాల్లోనే ఉండటం గమనార్హం. ఈ సర్వే ప్రకారం రూ.లక్ష లోపు వార్షిక ఆదాయం ఉన్న జనాభా రాష్ట్రంలో కోటీ 10 లక్షలు ఉంది. రాష్ట్ర మొత్తం జనాభాలో వీరు 31 శాతం. వీరిని నిరుపేదలుగా గుర్తించారు. ఈ మొత్తం నిరుపేదల్లో 40 శాతం మంది మాదిగ, లంబాడా, ముదిరాజ్, యాదవ కులాల్లోనే ఉన్నట్లు తేలింది. ఈ నాలుగు కులాల జనాభా రాష్ట్రం మొత్తం జనాభాలో 33 శాతం. రాష్ట్రంలో మొత్తం 242 కులాలు ఉండగా, సగటు పేదరిక స్థాయి కంటే ఎక్కువ మంది నిరుపేదలు ఉన్న కులాలు 135 ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 67 శాతం ఈ కులాల్లోనే ఉంది. నిరుపేదలు బీసీల్లో 63.4 లక్షలు, ఎస్సీల్లో 21.5 లక్షలు, ఎస్టీల్లో 14.3 లక్ష ల మంది ఉన్నారు. దాదాపు అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నప్పటికీ.. పేదరిక తీవ్రత స్థాయిలో కులాల మధ్య భారీ అంతరం ఉందని కాంపోజిట్ బ్యాక్‌వార్డ్‌నెస్ ఇండెక్స్ (సీబీఐ) స్కోరు స్పష్టం చేస్తోంది.
విద్యలో కులాల మధ్య భారీ అంతరం
విద్యా పరంగా కూడా కులాల మధ్య అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని కులాల్లో ఉన్నత విద్యావంతులు 35.37 శాతం ఉండగా.. మరికొన్ని కులాల్లో 5 శాతంలోపే ఉన్నారు. ఎస్టీ కొలాముల్లో 4.4 శాతం మాత్రమే ఉన్నత విద్యా వంతులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలు కొన్ని కులాల్లో 38 శాతం వరకు ఉండగా.. మరికొన్ని కులాల్లో 1 శాతమే ఉన్నారు. ఉద్యోగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కులాల ప్రాతినిధ్యం 17 శాతం ఉంటే.. కొన్ని కులాల్లో 1 శాతం కంటే తక్కువ ఉంది.
2 కులాల్లోనే బాలకార్మికులు అధికం
రాష్ట్రంలో బాలకార్మిక సమస్య ఆర్థికపరమైనది మాత్రమే కాదని.. అది కులాలతో అనుసంధానమై ఉందని సీపెక్ నివేదిక తేల్చింది. రాష్ట్ర జనాభాలో 18 సంవత్సరాల లోపు ఉన్నవారిలో 89,000 మంది బాలకార్మికులుగా రోజువారీ కూలీ పనిచేస్తున్నారు. వీరిలో మాదిగ కులంలో 14 శాతం ఉండగా, ఎస్టీ లంబాడా పిల్లలు 11 శాతం ఉన్నారు. అత్యధిక బాలకార్మికులు ఉన్న కులాలు విద్యలో వెనుకబడి ఉంటున్నాయి.
వడ్డెరల్లో 55 శాతం రోజు కూలీలే..
ఉపాధి విషయంలోనూ కులాల మధ్య తీవ్రమైన అంతరాలున్నాయి. బీసీ-ఏ వర్గంలోని వడ్డెర కులం జనాభాలో 55 శాతం మంది దినసరి కూలీలుగానే జీవిస్తున్నారు. రాష్ట్రంలో 25 - 65 ఏళ్ల మధ్య ఉన్న జనాభాలో సగటున 31.3 శాతం మంది దినసరి కూలీలుగా జీవిస్తున్నారు. అయితే, దినసరి కూలీలు కొన్ని కులాల్లోనే ఎక్కువగా ఉన్నారని సర్వే తేల్చింది. ఓసీ బ్రాహ్మణ కులంలో దినసరి కూలీలు 2.6 శాతం మాత్రమే ఉన్నారు. ఎస్టీల్లోని కొలాములు, కోయ, గోండులతోపాటు, ఎస్సీల్లోని మాదిగ, బేడ వంటి కులాల్లో ఎక్కువ జనాభా దినసరి కూలీలుగా జీవిస్తున్నారు. ఉద్యోగాల్లోనూ కులాల మధ్య అసమానతలు భారీగా ఉన్నాయి. కొన్ని బీసీ, ఎస్సీ కులాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచుకున్నా.. అదే వర్గాల్లో ఉన్న మరికొన్ని కులాలు ఇంకా అత్యల్ప స్థాయిలోనే ఉన్నాయని సీపెక్ సర్వేలో తేలింది.