మైనింగ్‌పై సీఐడీ!
ABN , Publish Date - May 24 , 2026 | 04:35 AM
రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి చోటుచేసుకున్న మైనింగ్ అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గత ప్రభుత్వంలో భారీ దోపిడీ.. 7 సంస్థలు, ముగ్గురు నేతల ప్రమేయం.. ప్రభుత్వ అంచనా
దర్యాప్తు జరిపించాలని క్యాబినెట్ నిర్ణయం
విద్యుత్తు కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంపై సీబీఐ దర్యాప్తు దిశగా అడుగులు వేగిరం
విద్యుత్తు సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన పథకాల్లో చేరేందుకు ఆమోదం
వ్యవసాయేతర విద్యుత్తు కనెక్షన్లకు ఇకపై స్మార్ట్, ప్రీపెయిడ్ మీటర్లు
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి చోటుచేసుకున్న మైనింగ్ అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్, విద్యుత్ అక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. కరీంనగర్, ఖమ్మంలలో జరిగిన గ్రానైట్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని.. సినరేజీ, రాయల్టీ కింద ఖజానాకు రావాల్సిన రూ.వేల కోట్ల నిధులు రాలేదని క్యాబినెట్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో క్వార్ట్జ్ తవ్వకాల్లో కూడా అక్రమాలు జరిగాయని, సిరిసిల్లలో భారీగా ఇసుక తవ్వకాలు జరిగినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు నిధులు రాకుండా మళ్లించారని తేల్చారు. మొత్తంగా ఏడు ఏజెన్సీలు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాయని, దీనిపై సీఐడీ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 2014 జూన్ 2వ తేదీ నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సీఐడీకి విధి విధానాలు జారీ చేయాలని మైనింగ్ శాఖను మంత్రివర్గం ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ అక్రమాల అంశంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐడీ దర్యాప్తు జరిపిస్తామని సీఎం ప్రకటించగా... విపక్షాలు మాత్రం సభాసంఘం వేయాలని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే, సీఎం ప్రకటించినట్లుగానే తాజాగా సీఐడీ దర్యాప్తునకు నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు మాజీ మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యుడు లక్ష్యంగా ఈ నిర్ణయం జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విద్యుత్‌పై సీబీఐ దర్యాప్తు దిశగా అడుగులు
బీఆర్‌ఎస్ హయాంలో కరెంటు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరిపించడానికి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీబీఐ దర్యాప్తునకు సమ్మతి తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేయాలని, దీనికన్నా ముందు కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేస్తూ ఇంధన శాఖ లేఖ రాయాలని మంత్రివర్గం ఆదేశించింది. బీఆర్‌ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందం, కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం, నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడం తదితర నిర్ణయాలతో ఖజానాకు జరిగిన నష్టంపై జస్టిస్ లోకూర్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్‌లో చర్చించినట్లు సమాచారం. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అన్ని ప్రక్రియలను వేగిరపరచాలని నిర్ణయించారు. మరోవైపు, విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, ధర్తీ అబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ యోజన పథకాల్లో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ పథకం కింద డిస్కంలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ప్రీపెయిడ్, స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. దేశవ్యాప్తంగా భారీ నష్టాల్లో ఉన్న డిస్కంలను మళ్లీ లాభాలబాట పట్టించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కోసం ఏటా ఛార్జీలను సవరించాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరటం ద్వారా రాష్ట్రంలోని రెండు డిస్కంలకు కేంద్రం నుంచి రూ.5వేల కోట్ల సాయం అందనుంది. మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ధర్తీ అబా పథకం కింద మైదాన ప్రాంతాల్లో విద్యుదీకరణకు అవసరమైన నిధుల్లో 60 శాతాన్ని కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో 80 శాతం నిధులను కేంద్రం, 20 శాతాన్ని రాష్ట్రం భరిస్తాయి.