Share News

రాహుల్‌ను ప్రధాని చేయాలన్న ఆకాంక్ష పెద్ద జోక్‌

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:04 AM

రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమంటూ సీఎం రేవంత్‌ పదేపదే ప్రకటించడం పెద్ద జోక్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పేర్కొన్నారు.

రాహుల్‌ను ప్రధాని చేయాలన్న ఆకాంక్ష పెద్ద జోక్‌
Ramchander Rao

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు బొగ్గు దొంగలు

  • ఎల్‌నినోపై అఖిలపక్షం నిర్వహించాలి

  • చిట్‌చాట్‌లో రాంచందర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమంటూ సీఎం రేవంత్‌ పదేపదే ప్రకటించడం పెద్ద జోక్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పేర్కొన్నారు. ‘రాహుల్‌ ప్రధాని కావాలని రేవంత్‌ ప్రకటించకపోతే ఆయనకు సీఎం కుర్చీ ఉండదు’ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ‘ఎల్‌నినో ప్రభావంతో తాగు, సాగునీటి సంక్షోభం ఏర్పడింది. పంట నష్టం తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో రేవంత్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి షికార్లు చేయడమేంటి? మా అంచనా ప్రకారం ఇప్పటివరకు రేవంత్‌ వందసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ ఎప్పుడు వస్తారు? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని విమర్శించారు.


ఎల్‌నినో ప్రభావంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. సింగరేణిలో బొగ్గు చోరీ జరిగిందంటూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ‘మా పార్టీనేత బొగ్గుశాఖ మంత్రి అయితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు బొగ్గు దొంగలు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?అన్న ప్రశ్నకు రాంచందర్‌రావు స్పందిస్తూ.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29మంది టిక్కెట్టు ఆశిస్తున్నారని అందులో తన పేరు లేదన్నారు. ఒకవేళ మీరు పోటీచేసి ఓడిపోతే పార్టీపై ప్రభావం ఉంటుందంటూ ప్రచారం జరుగుతోందని ప్రస్తావించగా.. ఊహాజనితమైన ప్రశ్నలకు జవాబులు ఉండవని అన్నారు. సర్‌, ఓట్‌ చోరీ అంశాలపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.


కాంగ్రెస్‌ ప్రచారానికి కౌంటర్‌గా వచ్చేనెల 1న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని.. ఆ తర్వాత కరీంనగర్‌, సిద్దిపేటలో వేలాదిమందితో ఈ ర్యాలీలు చేపడతామని తెలిపారు. ముస్లింల ఓట్లు ఎక్కడ అక్రమంగా తొలగించారో కాంగ్రెస్‌ వెల్లడించాలని సవాల్‌ చేశారు. ఓట్‌ చోరీ జరిగిందంటూ ఆరోపిస్తున్న రాహుల్‌గాంధీ.. ఎలా జరిగిందో నిరూపించలేకపోయారని అన్నారు. కాగా బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి సునీల్‌ బన్సల్‌ శనివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇంఛార్జిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న బన్సల్‌ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 06:04 AM