Share News

2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:44 AM

రాష్ట్రంలో తయారీ రంగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

  • తయారీ రంగం, ఎగుమతులను ప్రోత్సహించడంతో సత్ఫలితాలు: సీఎం

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తయారీ రంగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్‌ (లక్ష కోట్ల) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు.. అంతకుముందు మూడేళ్లతో పోల్చితే 68 శాతం అధికంగా నమోదయ్యాయని వెల్లడించారు. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఓ దినపత్రికలో కథనాన్ని జోడిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఏరోస్పేస్‌, ఇంజనీరింగ్‌ ఎగుమతులు పెరగడంతో పాటు మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లోనూ గణనీయమైన వృద్ధి నమోదవుతోందని సీఎం పేర్కొన్నారు.


రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని.. చురుకైన పాలన, సులభతర వాణిజ్యం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇది ఆరంభమేనని, తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌లో భాగంగా రూపొందించిన క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అభివృద్ధి ప్రణాళిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందనడంలో సందేహం లేదన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 06:44 AM