Share News

Harish Rao in Phone Tapping Case: హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:57 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు జారీ చేసింది.

Harish Rao in Phone Tapping Case: హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు
MLA Harish Rao

  • ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం

  • సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద అందజేత

  • మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసు

  • నార్సింగ్‌ నివాసంలో సిబ్బందికి అందజేత

  • సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి

  • హరీశ్‌రావుకు నోటీసు ఇదే తొలిసారి

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు జారీ చేసింది. మంగళవారమే (నేడు) జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి సీఆర్పీఎస్‌ సెక్షన్‌ 160 కింద నోటీసు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరి ఈ నోటీసులను జారీ చేశారు. 2024 మార్చి పదో తేదీన నమోదైన కేసు క్రైం నంబరు 243/2024 ఐపీసీ సెక్షన్‌ 166, 409, 427, 201, 120(బీ) రెడ్‌విత్‌ 34.3 ఆఫ్‌ పీడీపీపీ యాక్ట్‌ 1984 సెక్షన్‌ 65, 66, 66(ఎఫ్‌)(1)(బీ)(2) అండ్‌ 70 ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు తదుపరి విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొన్ని వాస్తవాలు, ఘటనలపై మీకు అవగాహన ఉందని దర్యాప్తులో తెలిసిందని, దానిపై విచారించాల్సి ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నిజానికి, హరీశ్‌ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉండగా.. నార్సింగిలోని ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు.


దాంతో, నోటీసు కాపీని సిబ్బందికి అందజేశారు. కాగా, రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తొలిసారిగా బీఆర్‌ఎస్‌ కీలక నేతకు నోటీసులు జారీ చేయడం.. ఇప్పుడు ఏకంగా ఆయనను విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు సిట్‌ సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రస్తుత, మాజీ అధికారులు, రాజకీయ నాయకుల్ని విచారించిన సిట్‌.. విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హరీశ్‌ రావును విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు సిద్ధమైంది. నిజానికి, సిట్‌ నుంచి తనకు నోటీసులు అందుతాయని హరీశ్‌రావు గతంలోనే ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారని, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తనకు ఇస్తారని ముందుగానే అంచనా వేసి చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరాన్నిబట్టి అధికారులు ట్యాపింగ్‌ చేస్తారని హరీశ్‌రావు గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, పలువురు అధికారులు, నాయకులను విచారించిన తర్వాత దర్యాప్తులో భాగంగా హరీశ్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందు నుంచీ కేసీఆర్‌ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నోటీ్‌సలు జారీ చేసి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 20 , 2026 | 07:35 AM