Share News

పరిశ్రమలో గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికుల మృతి

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:51 AM

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం సరాకా లేబొరేటరీస్‌ పరిశ్రమలో గురువారం రాత్రి క్లోరోఫామ్‌ గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పరిశ్రమలో గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికుల మృతి
saraca laboratories gas leak

  • మరో ఆరుగురికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

  • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలోని

  • సరాకా లేబొరేటరీస్‌ పరిశ్రమలో ఘటన

  • టీజీపీసీబీ తనిఖీలు.. మూసివేతకు ఆదేశాలు

జిన్నారం, హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం సరాకా లేబొరేటరీస్‌ పరిశ్రమలో గురువారం రాత్రి క్లోరోఫామ్‌ గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిశ్రమలో గురువారం రాత్రి కార్మికులు నైట్‌ షిఫ్ట్‌ విధుల్లో ఉండగా.. ప్రొడక్షన్‌ బ్లాక్‌ యూనిట్‌-2 క్లోరోఫామ్‌ పైప్‌లైన్‌ వాల్వ్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. దీంతో 8 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. పంగా సుదర్శన్‌రావు(44), కిలపర్తి బాలాజీ(29) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


వీరిద్దరూ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు. ఈ ప్రమాదంపై పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచీ ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.70 లక్షల చొప్పున పరిహారం, అంత్యక్రియలకు రూ.1లక్ష నగదును యాజమాన్యం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు, వారి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కాగా, ఈ ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) చర్యలు చేపట్టింది.


ప్రమాద తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న టీజీపీసీబీ అధికారులు శుక్రవారం పరిశ్రమను తనిఖీ చేశారు. పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ మధు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ యోగేశ్వర్‌రావు నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. పరిశ్రమను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా పరిశ్రమ యాజమాన్యానికి ముందస్తు విచారణ అవకాశం కల్పించకుండానే మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు టీజీపీసీబీ వెల్లడించింది.


కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : హరీశ్‌రావు

సరాకా రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు సిగాచీ.. నేడు సరాకా పరిశ్రమలో ప్రమాదం.. అయినా గత చేదు అనుభవాల నుంచి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా? అని శుక్రవారం ఎక్స్‌ లో ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిగాచీ ఘటనలో ఇంటి పెద్దలను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలకు సీఎం స్వయంగా ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలని సూచించారు. సరాకా పరిశ్రమ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:51 AM