Share News

సురక్షిత దక్షిణభారతమే లక్ష్యం

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:20 AM

రాష్ట్రాల సరిహద్దుల గీతను దాటి దక్షిణాది రాష్ట్రాల పోలీసులు సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని, నేరాల నియంత్రణకు పటిష్ఠమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

సురక్షిత దక్షిణభారతమే లక్ష్యం
South India Police Coordination

  • రాష్ట్రాల సమన్వయంతోనే పటిష్ఠ పోలీసు వ్యవస్థ..

  • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పంచుకునేందుకు సిద్ధం

  • పోలీసు వ్యవస్థకు ఇచ్చే డబ్బు ఖర్చు కాదు..

  • మెరుగైన సమాజ నిర్మాణానికి పెట్టుబడి

  • తెలంగాణ పోలీసు శాఖలో చేపట్టిన

  • సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి

  • దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల సరిహద్దుల గీతను దాటి దక్షిణాది రాష్ట్రాల పోలీసులు సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని, నేరాల నియంత్రణకు పటిష్ఠమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క రాష్ట్రం తమ ప్రయత్నాలతో నేర రహితంగా మారడం సాధ్యం కాదని, అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వ్యవస్థను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, వ్యవస్థీకృత నేరాల ముప్పును సమన్వయ చర్యల ద్వారా అదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. నేరాల స్వరూపం మారుతున్న క్రమంలో ఇలాంటి సమన్వయ వేదికలు ఎంతో కీలకమన్నారు. పోలీసింగ్‌కు కొత్తరూపం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్కరణలను విశ్వసించే తాను.. పోలీసు వ్యవస్థకు అందించే ప్రతి పైసానూ ఖర్చుగా భావించనని అన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా భావిస్తానని చెప్పారు.


ప్రత్యేక విభాగాల ఏర్పాటు..

వివిధ రకాల నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు తెలంగాణలో ఇప్పటికే ఈగల్‌, హైడ్రా, టీజీ సేఫ్‌ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్‌ సమస్యలు అత్యంక కీలకంగా మారాయని, ప్రతి విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తెలంగాణ పోలీసు శాఖలో చేపట్టిన సంస్కరణలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయని,మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి రంగాల్లో తెలంగాణ పోలీసుశాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. ప్రధాని నిర్వహించిన ప్రగతి సమీక్షలో సైబర్‌ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించారు.


తెలంగాణను పూర్తిగా నక్సల్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం అభినందించారని చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఈగల్‌ఫోర్స్‌ కేంద్రం నుంచి 80 శాతానికిపైగా మార్కులు సాధించిందన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తుల పరిరక్షణతోపాటు చెరువులు, సరస్సులు, జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడంలో హైడ్రా..ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. కాగా, నేరాల కట్టడికి దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణతోపాటు ఉమ్మడి సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి, నోడల్‌ అధికారులను నియమించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసుశాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. సమావేశానికి కర్ణాటక డీజీపీ ఎం.ఏ.సలీం, తమిళనాడు డీజీపీ మహేశ్‌ అగర్వాల్‌, పుదుద్చేరి డీజీపీ శాలినీ సింగ్‌, లక్షద్వీప్‌ ఏడీజీ శంకర్‌ జైస్వాల్‌, ఏపీ ఐజీ రవికృష్ణ, కేరళ ఐజీ అజితా బేగం, కేంద్ర పోలీసు విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 06:20 AM