కాళేశ్వరం విచారణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ సవాల్
ABN , Publish Date - Oct 22 , 2026 | 08:33 PM
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షాల నిరసనలు శాంతియుతంగా జరిగిన రోజు మేధావులు, ప్రజలు హర్షిస్తారని అన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత టీషర్టులు వేసుకుని బారికేడ్లు ఎక్కుతున్నారంటూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షాల నిరసనలు శాంతియుతంగా జరిగిన రోజు మేధావులు, ప్రజలు హర్షిస్తారని అన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత టీషర్టులు వేసుకుని బారికేడ్లు ఎక్కుతున్నారంటూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గీత దాటి వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రతిపక్షాలను హెచ్చరించారు. దేశంతో సంబంధం లేని వ్యక్తులు పార్లమెంట్‌పై దాడి చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తామంటే అరెస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ తీరును ఈ సందర్భంగా మెదక్ ఎంపీ ఎండగట్టారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న తెలంగాణలో బీజేపీ అరెస్టులపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని కేంద్రప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలపై విచారణకు ఇవ్వకుండా.. ఓ బ్యారేజ్ మీద ఎందుకు విచారణ అడుగుతున్నారో సమాధానం చెప్పాలని అధికార పార్టీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పెంచి పోషిస్తున్న కాంట్రాక్టర్ ను కాపాడేందుకే విచారణకు ఇవ్వడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీలో పొత్తు కోసం నంది నగర్ కేసీఆర్ నివాసానికి గతంలో గులాంనబీ ఆజాద్‌తో వెళ్లింది నిజం కాదా? అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఎంపీ సూటిగా ప్రశ్నించారు. కొండారెడ్డి పల్లిలో ఎన్ని ఓట్లు పోయాయో వాళ్లను వేంకటేశ్వరస్వామి గుడికి తీసుకురావాలని.. లేకుంటే తన సొంత ఊరు బొప్పాపురంనకు రావాలని ఎస్ఐఆర్(SIR)పై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఓట్లు పోలేదు కానీ తెలంగాణ నుంచి డిల్లీకి నోట్లు పోతున్నాయని వ్యంగ్యంగా అన్నారు. ముస్లిం ఓటర్లు కూడా కాంగ్రెస్ వాదనను పట్టించుకోవడం లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. హిందువుల ఓట్లు శాస్త్రీయంగా పోయాయన్నారు.
హైదరాబాద్‌లో ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణం సొంత ఊర్లోనే ఓటును ఉంచుకున్నారని వివరించారు. గతంలో సొంతూరుతోపాటు హైదరాబాద్‌లో కలిపి రెండు ఓట్లు ఉండేవని రఘునందన్ రావు అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ సభ పెట్టే ముందు కొండారెడ్డి పల్లిలో ఎన్ని ఓట్లు పోయాయో ఓటర్ లిస్ట్ బహిరంగ పర్చాలని రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు పోలేదని నిరూపించడానికి బీజేపీ ప్రజా ప్రతినిధులము సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష పార్టీలకు ఆయన స్పష్టం చేశారు. బీసీలపై చిత్త శుద్ధి ఉంటే మంత్రివర్గంలో జనాభాకు అనుగుణంగా 56 శాతం మంత్రి పదవులు ఇవ్వాలని అధికార పార్టీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీల ఆస్తుల వివాదం పై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశానని తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందన తర్వాత వివరాలు వెల్లడిస్తానని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.