Share News

స్పీడ్ పోస్ట్‌తో దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:20 PM

దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గంజాయిను స్పీడ్ పోస్ట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారని.. జార్ఖండ్‌కు చెందిన సత్యం మిశ్రాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

స్పీడ్ పోస్ట్‌తో దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా: సీపీ సజ్జనార్
CP Sajjanar

హైదరాబాద్, జులై 2: దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. H- Fast అధికారులు, గుడిమల్కపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుల్ని అరెస్ట్ చేశారన్నారు. గంజాయిను స్పీడ్ పోస్ట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారని.. జార్ఖండ్‌కు చెందిన సత్యం మిశ్రాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇంటర్ చదివిన సత్యం మిశ్రా పెయింట్ పని చేసి మానేశాడని.. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేశాడన్నారు. 2018లో గంజాయికి అలవాటు పడ్డ మిశ్రా.. రాహుల్ జై, సచిన్ మిశ్రా, సంతోష్‌తో సిండికేట్‌గా ఏర్పడి.. సొంత ఊరిలోనే గంజాయి పంట వేశారని తెలిపారు. ఊరిలో చాలా మందితో గంజాయి పంట పండించి కొనుగోలు చేసి కస్టమర్లకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. స్పీడ్ పోస్ట్, కొరియర్ సేవల ద్వారా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.


హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాలకు గంజాయి సరఫరా చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. పార్సిళ్లలో మందులు ఉన్నట్లు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి పోస్టల్ అధికారులను మోసగిస్తున్నారని.. ఇస్రీ బజార్, ఫుస్రో పోస్టాఫీసుల నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సిళ్లు బుక్ చేసినట్లు గుర్తించామన్నారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుని UPI ద్వారా నగదు లావాదేవీలు జరిగేవన్నారు. రోజుకు 80 -100 ఆర్డర్లు వస్తుండగా.. అందులో 8 నుంచి 10 వరకు స్పీడ్ పోస్ట్ పార్సిళ్ల ద్వారా గంజాయి పంపిణీ చేస్తున్నారన్నారు. ఒక్కో పార్సిల్‌లో 50 - 250 గ్రాముల గంజాయి ఉంచుతూ డెలివరీ చేస్తున్నారని.. ఒక్కో ప్యాకెట్ రూ.1,500 నుంచి రూ.8,000 వరకూ విక్రయిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారు రూ.1 లక్ష ఆదాయం లభించగా.. నెలకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలు, ఏడాదికి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల టర్నోవర్ ఉందన్నారు. సరఫరాదారులు, కస్టమర్స్ మధ్య కోడ్స్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ జరుగుతుందని తెలిపారు. వాట్సాప్‌లో వివిధ కోడ్స్ ద్వారా కస్టమర్స్ గంజాయి ఆర్డర్ చేస్తున్నారని అన్నారు.


వచ్చిన డబ్బుతో నిందితులు బంగారం, లగ్జరీ వాహనాలు కొనుగోలు చేశారని సీపీ వెల్లడించారు. నిందితులు పలు బ్యాంక్ ఖాతాలు, PhonePe UPI ఐడీలతో మనీలాండరింగ్ చేసినట్లు గుర్తించామన్నారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన స్పీడ్ పోస్ట్ పార్సిళ్లకు స్కానింగ్ లేకపోవడంతో సరఫరా సులభమైందన్నారు. పోస్టల్ పార్సిళ్లకు తప్పనిసరి స్కానింగ్ అమలు చేయాలని కేంద్ర శాఖలకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్ నగర్, గుడిమల్కపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్సిల్‌పై అనుమానం కలిగి దర్యాప్తు చేశామని.. హైదరాబాద్‌కు వచ్చిన 2 పార్సిల్స్ ఫ్లైట్‌లోనే వచ్చాయన్నారు. నగరంలోని అన్ని కొరియర్ సంస్థలకు ప్రతి పార్సిల్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తాన్నారు. అనుమానాస్పద పార్సిళ్లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ బోడుప్పల్‌లో భూ పోరాటం.. కవిత అరెస్ట్

‘మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 04:29 PM