Share News

60 ఎకరాల్లో అరాచకానికి చెక్‌!

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:48 AM

11 జీఓను ఉల్లంఘిస్తూ జన్వాడ సాగు భూముల్లో 60 ఎకరాల్లో వేస్తున్న అక్రమ లేఅవుట్‌కు ప్రభుత్వ అధికారులు చెక్‌ పెట్టారు. అక్రమ లేఅవుట్‌ అభివృద్ధి పనులను నిలిపివేశారు. అక్రమ లేఅవుట్‌ వేస్తున్న నిర్వహకులకు నోటీసులు సైతం జారీ చేశారు.

60 ఎకరాల్లో అరాచకానికి చెక్‌!
50 accers

  • పనులు నిలిపివేసిన అధికారులు

  • హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, సీఎంసీల నోటీసులు

  • కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం: ఆర్డీవో పార్థసింహా

  • రియల్‌ దాహానికి చరిత్ర గురుతు మాయం

  • బుల్కాపూర్‌ నాలా పూడ్చి రోడ్లు, వెంచర్లు

  • వందల ఏళ్ల వరద కాల్వ 12ఏళ్లలో మాయం

  • హుస్సేన్‌సాగర్‌ వరకు అదే పరిస్థితి

  • బుల్కాపూర్‌ శిథిలం వల్లే 1908 వరదలు

  • దాంతో మళ్లీ పునరుద్ధరించిన నాటి నిజాం

హైదరాబాద్‌ సిటీ, శంకర్‌పల్లి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): 111 జీఓను ఉల్లంఘిస్తూ జన్వాడ సాగు భూముల్లో 60 ఎకరాల్లో వేస్తున్న అక్రమ లేఅవుట్‌కు ప్రభుత్వ అధికారులు చెక్‌ పెట్టారు. అక్రమ లేఅవుట్‌ అభివృద్ధి పనులను నిలిపివేశారు. అక్రమ లేఅవుట్‌ వేస్తున్న నిర్వహకులకు నోటీసులు సైతం జారీ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గండిపేట జలాశయానికి సమీపంలోనే కొండలు తవ్వి, కాల్వలు పూడ్చి కొందరూ బడా వ్యక్తులు అక్రమ లేఅవుట్‌ ఏర్పాటుపై ’60 ఎకరాల్లో అరాచకం’ అనే శీర్షికతో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్‌, సైబరాబాద్‌ మున్సిపల్‌ అధికారులు ఆగమేఘాల మీద శనివారం అక్రమ లేఅవుట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ ఆహ్మద్‌ ఆదేశాల మేరకు ఏపీఓ రాజశేఖర్‌తో పాటు ఇతర అధికారులు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో 60 ఎకరాల్లో అక్రమంగా వేస్తున్న లేఅవుట్‌ను పరిశీలించారు. బుల్కాపూర్‌ నాలాను పూడ్చేయడం, జేసీబీలు, డోజర్లతో అక్రమ లేఅవుట్‌ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్‌ చేస్తున్న నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం అందించామని, అనధికారిక లేఅవుట్‌లో స్థలాలను గుంటల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేయకుండా రెవెన్యూ అధికారులకు లేఖ రాస్తామని హెచ్‌ఎండీఏ ఉన్నఽతాధికారులు తెలిపారు. జన్వాడలో అక్రమ లేఅవుట్‌ ప్రాంతాన్ని చేవెళ్ల ఆర్డీఓ, శంకర్‌పల్లి తహసీల్దార్‌లు పరిశీలించారు. వెంటనే అక్రమ లేఅవుట్‌ నిర్వహకులకు పనులు నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్‌ ఏ విధంగా వేస్తారని నిర్వాహకులను ప్రశ్నించారు. ఫామ్‌ప్లాట్ల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశాలిచ్చిన్నట్లు తెలిసింది.


అనుమతులు ఏవీ?

శనివారం ఉదయం చేవెళ్ల ఆర్‌డీవో పార్థసింహారెడ్డి, శంకర్‌పల్లి తహసీల్దార్‌ సురేందర్‌, నీటిపారుదల శాఖ డీఈ జలంధర్‌, ఏఈ సౌజన్యలు జన్వాడ వెంచర్‌ ప్రాంతాన్ని సందర్శించారు. పూర్ణానంద గ్లోబల్‌ స్పిరిచ్యువల్‌ సెంటర్‌ పేరిట బోర్డు పెట్టి, లోపల నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ నిర్మిస్తుండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అనుమతులు ఉన్నాయా? ఉంటే చూపెట్టండి అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. పనులు వెంటనే నిలిపివేయాలని ఆర్‌డీవో ఆదేశించారు. పేరుమోసిన బిస్కెట్‌ కంపెనీ యజమాని సుమారు 50-60 ఎకరాలలో సర్వే నెంబర్లు 651, 652, 653, 654, 655, 656, 657, 658లలో యథేచ్ఛగా ఎలాంటి నాలా కన్వర్షన్‌ లేకుండా రోడ్లు వేసి, డ్రైనేజీ నిర్మించి, విద్యుత్‌ స్తంభాలు పాతి పనులు కొనసాగిస్తున్నారు. విద్యుత్‌ అనుమతి ఎలా ఇచ్చారనే విషయాన్ని అధికారులు చర్చించుకున్నారు. జన్వాడలోని గ్రీన్‌ఫీల్డ్‌ వెంచర్‌ను సైతం అధికారులు సందర్శించారు. సీసీ రోడ్లు వేసి నిర్మాణాలు కొనసాగిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించారు. పూర్ణానంద గ్లోబల్‌ స్పిరిచ్యువల్‌ సెంటర్‌లో నిర్మిస్తున్న వెంచర్‌ శంకర్‌పల్లి-హైదరాబాద్‌ రోడ్డుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం, ప్రహరీ నిర్మించడంతో లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి, డ్రైనేజీ నిర్మించి, విద్యుత్‌ స్తంభాలు పాతడం పట్ల చేవెళ్ల ఆర్‌డీవో పార్థసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంచర్‌పై పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌ నారాయణరెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. నార్సింగి డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి సైతం అక్రమ నిర్మాణం గురించిన లేఖను రాయనున్నట్లు ఆర్‌డీవో తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఆర్‌డీవో పేర్కొన్నారు. ఫిరంగినాలా కబ్జా గురించికలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని నీటి పారుదల శాఖ డీఈ జలంధర్‌ వివరించారు.


జన్వాడలో అన్నీ అక్రమ నిర్మాణాలే

జన్వాడలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. 111 జీవోను ఉల్లంఘించి వెంచర్లు వేసి ప్లాట్లు చేసి బడా వ్యక్తులు విల్లాలు నిర్మిస్తున్నారు. 10 శాతం మేరకే నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా అవేవి పట్టించుకోకుండా నిర్మాణాలు సాగిస్తున్నారు. అధికారులు నోటీసులు అందజేసినా బడా బాబులు, పెద్దపెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అవేవీ పట్టించుకోవడం లేదు. నిర్మాణాలు పూర్తి చేసి ఇంటి నెంబర్‌లను తీసుకుంటున్నారు. ప్రక్కనే గండిపేట జలాశయం ఉండటంతో ఈ నిర్మాణాలలోని మురుగునీరంతా చేరి, గండిపేట కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వందల ఏళ్లనాటి ఫిరంగి నాలాను కబ్జా చేసి రోడ్లువేసి నిర్మాణాలు సాగిస్తున్నా నీటి పారుదల శాఖ అధికారుల్లో ఆయితే చలనమే లేదు.


Updated Date - Sep 06 , 2026 | 06:56 AM