Share News

మందుల ధరలు పైకి!

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:25 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు! కానీ..

మందుల ధరలు పైకి!

  • యుద్ధంతో పెరిగిన ముడిసరుకుల రేట్లు.. 900 రకాల ఔషధాల ధరల పెంపు

  • 20 శాతం నుంచి 186 శాతం వరకు భారం

  • ఒప్పందం ధరలకు సరఫరా చేయలేం

  • ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారుల లేఖలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు! కానీ.. ఈ యుద్ధ ప్రభావం మన ఊహకు కూడా అందని రంగాలపై పడుతోంది. ఉదాహరణకు.. ఫార్మా రంగం. బల్క్‌ డ్రగ్స్‌, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ముడిపదార్థాల (ఏపీఐల) సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు.. మందుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే మందుల షాపుల్లో అందుబాటులో ఉన్న స్టాకంతా యుద్ధం మొదలు కావడానికి ముందు తయారై వచ్చింది. వాటి ధరలు అలాగే ఉంటాయిగానీ.. కొత్తగా తయారవుతున్న ఔషధాల ధరలు మాత్రం భారం కానున్నాయి. మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాల ధరలు 200 శాతం-300 శాతం వరకు పెరగడమే ఈ పెరుగుదలకు కారణమని ఫార్మా రంగాలు పేర్కొంటున్నాయి. దీంతో, పలు ఔషధాల ధరలను 20 శాతం నుంచి గరిష్ఠంగా 180 శాతం దాకా పెంచి విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించినట్టు ఫార్మా రంగానికి చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. సుమారు 900 రకాల ఆవశ్యక ఔషధాల (ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌) ధరలు పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉపయోగించే పారాసెటమాల్‌, యాంటీ బయాటిక్స్‌, నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్‌, స్టెరాయిడ్‌ ఔషధాల కొత్త స్టాకు ధరలను ఇప్పటికే పెంచినట్టు సమాచారం. దీర్ఘకాలిక వ్యాదులకు మందులు వాడేవారు, జ్వరం, నొప్పులు, ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు... ఈ పెంపు ఆర్థికంగా భారంగా మారనుంది. ద్రవ ఔషధాల తయారీలో కీలకమైన గ్లిజరిన్‌ (తీపి, చిక్కదనం కోసం, బాటిల్‌ తెరిచినప్పుడు నీరు ఆవిరైపోకుండా, మందు ఎండిపోకుండా ఉండడం కోసం వాడతారు), ప్రొపైలిన్‌ గ్లైకాల్‌ (కొన్ని రకాల మందులు నీటిలో కరగవు. అలాంటివాటిని కరిగించి ద్రవం అంతా సమానంగా విస్తరించేలా చేస్తుంది; మందులోని రసాయనాలు విడిపోకుండా, బాటిల్‌ అడుగున పేరుకుపోకుండా చేస్తుంది; మందులో సూక్ష్మజీవులు పెరగకుండా చేస్తుంది(ప్రిజర్వేటివ్‌)) వంటివాటి ధరలు పెరగడంతో సిర్‌పలు, ఓరల్‌ డ్రాప్స్‌తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి.


ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే.. పెరిగిన ఈ మందుల భారాన్ని రోగులపై వేయనున్నారు. ఇక.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బడ్జెట్‌ పరిమితుల వల్ల మందుల సరఫరా కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే.. మందుల సరఫరాదారులు చేతులెత్తేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే.. ప్రభుత్వానికి మందులు సరఫరా చేసేవారు ఏడాది/రెండేళ్లపాటు ఒకే ధరకు ఇంత పరిమాణంలో మందులు సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉదాహరణకు.. కొందరు సరఫరాదారులు పారాసెటమాల్‌ రెండేళ్లపాటు... 35 పైసల ధరలో కోటి ట్యాబ్లెట్స్‌ సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. యుద్ధం దెబ్బకు ముడిపదార్థాల ధరలు పెరగడంతో అదే ధరకు సరఫరా చేయలేమని లేఖలు రాశారు. యుద్ధం ముగిశాక కావాలంటే పాత ధరకే సరఫరా చేస్తామని, అప్పటివరకు చేయలేమని స్పష్టంచేశారు. విపత్తుల సమయంలో ఒప్పందంలో మార్పులుండొచ్చని పేర్కొంటూ..ఆ నిబంధన కింద ఈ లేఖలు రాశారని తెలిసింది. కాగా.. పెరిగిన ధరల నేపథ్యంలో రోజువారీ మందులు ఉపయోగించే వారికి జనరిక్‌ మందులు ప్రత్యామ్నాయం కానున్నాయి.

కొత్త స్టాక్‌ వస్తేనే ఎంత పెరిగిందీ తెలుస్తుంది

మందుల ధరలు విపరీతంగా పెరిగాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, పెరగడం కొత్తేం కాదు. కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంటాయి. కాకపోతే ఆ పెరుగుదల5-10 శాతం వరకు ఉంటుంది. కానీ ఈ సారి 90 శాతం వరకు ధరలు పెరిగినట్లు వినిపిస్తోంది. ఎవేవి ఎంత పెరిగాయనేది కొత్త స్టాక్‌ వస్తేనే తెలుస్తుంది. అందుబాటులో ఉన్న స్టాక్‌పై పాత ధరల ప్రకారమే విక్రయాలు జరుగుతాయి.

- రవి, మందుల దుకాణం నిర్వాహకుడు

Updated Date - Apr 03 , 2026 | 05:59 AM