Share News

బీ, సీ కోటా సీట్లు మాకొద్దు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:32 AM

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో మేనేజ్‌మెంట్‌ (బీ క్యాటగిరీ), ఎన్‌ఆర్‌ఐ(సీ క్యాటగిరీ) కోటాల్లోని ఎంబీబీఎస్‌ సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి.

బీ, సీ కోటా సీట్లు మాకొద్దు
MBBS seats vacant 2026

  • యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా ఎంబీబీఎస్‌ సీట్లపై విద్యార్థుల అనాసక్తి

  • ఫీజుల భారం మోయలేకనే ఈ క్యాటగిరీలకు దూరం

  • ఈ ఏడాది నాలుగైదు వేల బీ, సీ క్యాటగిరీ సీట్లు మిగిలిపోయే అవకాశం

  • తెలంగాణ రాష్ట్రంలోనే 200 సీట్ల వరకు ఖాళీ

  • ఈ నెల 26తో ముగియనున్న యూజీ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో మేనేజ్‌మెంట్‌ (బీ క్యాటగిరీ), ఎన్‌ఆర్‌ఐ(సీ క్యాటగిరీ) కోటాల్లోని ఎంబీబీఎస్‌ సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ప్రకటించిన అన్ని రకాల కౌన్సెలింగ్‌ ప్రక్రియల గడువు ఈ నెల 26వ తేదీతో ముగియనుంది. ప్రస్తుత సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సుమారు 4-5 వేల వరకు బీ, సీ కోటా సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. తెలంగాణలో 200 వరకు మిగిలిపోతాయని సమాచారం. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 11,966 ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయ


. ఇంత భారీస్థాయిలో సీట్లు మిగిలిపోవడానికి కారణం బీ, సీ క్యాటగిరీ సీట్ల ఫీజులు భారీగా పెరగటమేనని అంటున్నారు. ఈ కోటాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేయాలంటే రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు ఖర్చవుతోంది. దీనికితోడు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సీ క్యాటగిరీ విషయంలో తీసుకొచ్చిన నియమ నిబంధనలు కూడా విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది విద్యార్థులు నీట్‌ పరీక్షలో అర్హత సాధించినా ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్‌ వర్సిటీల్లో బీ, సీ క్యాటగిరీ సీట్లకు నిర్ణయిస్తున్న భారీ ఫీజులు కట్టలేక వెనక్కి తగ్గుతున్నారు.


బీ క్యాటగిరీ సీటుకు ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.10 లక్షలకు పైగానే ఉంటోంది. సీ క్యాటగిరీ సీట్లయితే ఏడాది ఫీజు రూ.20-24 లక్షలు ఉంటోంది. దీనికి హాస్టల్‌, మెస్‌, లైబ్రరీ, ఇతర కాలేజీ ఖర్చులు అదనంగా ఉంటున్నాయి. దీంతో ఎంబీబీఎస్‌ పూర్తిచేసే సరికి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతోందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో స్పాన్సర్‌ లభిస్తే ఎన్‌ఆర్‌ఐ కోటా సీటు తేలిగ్గా దొరికేది. కానీ, ప్రస్తుతం నిబంధనలు మారడంతో సులభంగా దొరకటం లేదు.


పలు రాష్ట్రాల్లో ఫీజుల పరిస్థితి...

తెలంగాణలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో బీ క్యాటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.15 - 13 లక్షల వరకు ఉంది. సీ క్యాటగిరీ సీటు ఫీజు రూ.22-24 లక్షల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీ క్యాటగిరీ ఫీజు రూ.14.52 లక్షలు, సీ క్యాటగిరీ సీటుకు రూ.43.56 లక్షలకు పెంచారు. ప్రభుత్వ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కింద బీ క్యాటగిరీ సీటుకు ఏడాదికి రూ.12 లక్షలు, సీ క్యాటగిరీ కింద రూ.20 లక్షలుగా నిర్ణయించారు. తమిళనాడులో బీ సీటుకు రూ.15 లక్షలు, సీ సీటుకు రూ.27 లక్షల ట్యూషన్‌ ఫీజు ఉంది. డీమ్డ్‌ వర్సిటీల్లో సీ సీటు ఫీజు రూ.30 లక్షలకు పెరిగింది.


రాజస్థాన్‌లో సీ కోటా ఫీజును రూ.31 లక్షల నుంచి రూ.23.9 లక్షలకు తగ్గించారు. ఈ ఏడాది తమిళనాడు, పుదుచ్చేరిలోని డీమ్డ్‌ వర్సిటీల్లో 824 ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలిపోయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరంలో 839 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ వర్సిటీల్లో 1,40,664 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 64,121, ప్రైవేటులో 76,543 సీట్లున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో డీమ్డ్‌ వర్సిటీల్లోకొత్తగా 13 వేల ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతిచ్చింది. దీంతో డిమాండ్‌కు మించి సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు ఉందని వైద్యవిద్య నిపుణులు తెలిపారు.


దేశంలో గత నాలుగేళ్లలో మిగిలిపోయిన ఎంబీబీఎస్‌ సీట్లు

(లోక్‌సభలో గతేడాది కేంద్రం వెల్లడించిన గణాంకాల ఆధారంగా)

విద్యా సంవత్సరం

మిగిలిపోయిన సీట్లు

2021-22

2,012

2022-23

4,146

2023-24

2,959

2024-25

2,849


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:36 AM