హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:46 PM
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. అరుంధతి సినిమా తరహాలో ఆయన పూజలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఈ ఏడాది మార్చి 2న తమిళనాడులోని తిరుచ్చికి, జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని.. ఆ తేదీల్లో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు వివరించాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.
తిరుపతికి వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. అఘోరీ ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని కోరుకుంటూ ఆయన క్షుద్ర పూజలు చేశారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం దేవుడిని ప్రార్థించడం సహజమని.. కానీ మాజీ మంత్రి మాత్రం ప్రజలకు కీడు జరగాలని పూజలు చేశారని విమర్శించారు. తన రాజకీయ స్వార్థం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై నిజాలు బయటపెట్టినందుకే అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్‌లకు లీగల్ నోటీసులు పంపించారని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. అయితే లీగల్ నోటీసులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అఘోరాలతో క్షుద్ర పూజలు చేశారనే ప్రచారం గతంలో జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. ఇప్పుడు హరీశ్ రావుపై వస్తున్న ఆరోపణలతో కేసీఆర్ పూజలు కూడా నిజమేనని అనిపిస్తోందన్నారు. యాదగిరిగుట్టకు వెళ్లి పొర్లు దండాలు పెట్టి మరీ ఏం చేశారో ప్రజలకు హరీశ్ రావు చెప్పాలని ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. గతంలో మంత్రాలు, తంత్రాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ఉన్నాయని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఆచారాలను బలంగా నమ్ముతారని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, టీపీసీసీ చీఫ్ ఆరోపణలపై హరీశ్ రావు, బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
వార్తలు కూడా చదవండి...
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి